ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక బ్యాండ్ బాజానే..
కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989ని సవరిస్తూ ముసాయిదా విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో రూల్ 139-ఎ కింద కొత్తగా ‘కంట్రోల్ ఆఫ్ ట్రాఫిక్’ అని, 139-బి కింద ‘ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ’ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీటిపై అభ్యంతరాలున్నవారు 30రోజుల లోపు సలహాలు, సూచనలు పంపాలని ఆహ్వానించింది.
కొత్త నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..
కొత్త నిబంధనల ప్రకారం పోలీసులు, రవాణా సిబ్బందికి బాడీ వేరబుల్ కెమెరాలు ఇస్తారు. రహదారుల వెంట పోలీసు వాహనాల డ్యాష్ బోర్డుల్లోనూ ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. అందులోనే సీసీటీవీ కెమెరా, స్పీడ్‌గన్, వాహనాల బరువును పసిగట్టే సెన్సార్లు ఉంటాయి.
కొత్త నిబంధనల ప్రకారం పోలీసులు ధరించిన కెమెరాలు, రహదారుల పక్కన ఏర్పాటు చేసిన కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలు, చిత్రాల ఆధారంగా చర్యలు తీసుకొనే అధికారం పోలీసులు, రవాణా అధికారులకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని హైరిస్క్, హైడెన్సిటీ కారిడార్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, రద్దీ కూడళ్లు, రాష్ట్ర రాజధానులు, 10లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇలాంటి ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలు ఏర్పాటు చేస్తాయి. అతి వేగంతో వాహనాన్ని నడిపినప్పుడు; నోపార్కింగ్ ఏరియాల్లో వాహనాలను ఆపినప్పుడు, డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపినప్పుడు, ఈ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా చలానాలు జారీ చేస్తారు. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా, ఓవర్ టేక్ చేసినా కూడా ఈ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి, దాని ప్రకారం చలానా వెళ్లిపోతుంది. అయితే చలాన్లు రాస్తే.. ఆ విషయంపై 15 రోజుల్లోపు వాహనదారులకి నోటీసు పంపాల్సి ఉంటుంది. చలాన్లను నిర్దిష్ట గడువులోగా చెల్లించేలా నిబంధనలు కూడా ఇందులో పొందు పరిచారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సేకరించిన సాక్ష్యాధారాలను కనీసం 30 రోజుల పాటు భద్రపరిచి వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటారు. మొత్తమ్మీద ఇకపై చలాన్లు రాయడానికి రికార్డెడ్ సాక్ష్యాధారాలను తీసుకు వస్తోంది ప్రభుత్వం. పోలీసులకే వేరబుల్ కెమెరాలు ఇచ్చి మరింత పగడ్బందీగా నిబంధనలు అమలు చేయబోతోంది.