బతికుండగానే పేర్లు పెట్టేసుకుంటారా..ఇదెక్కడి న్యాయం..!
మొతేరా స్టేడియానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం అని పేరు ఉండేది. పునరుద్ధరణ తర్వాత ఏకంగా నరేంద్రమోడీ స్టేడియం అని మార్చడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. పటేల్‌ను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నిజాలు దానంతట అవే బయటపడుతుంటే ఎంత బాగుంటుందని అన్నారు. అటు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాగేల్ కూడా స్టేడియం పేరు మార్పును వ్యతిరేకించారు. బతికి ఉన్నప్పుడే ప్రాంతాలు, కట్టడాలకు వారి పేర్లు పెట్టుకోవడం బీజేపీ సంప్రదాయం అని చెప్పారు. వాజ్‌పేయ్ బతికున్నప్పుడే చత్తీస్‌గడ్‌లో అటల్ చౌక్ అని పెట్టారు. అప్పుడు వాజ్‌పేయి పదవిలో లేరని.. అలాగే త్వరలో మోడీ కూడా మాజీ అవుతారని జోస్యం చెప్పారు భూపేష్ బాగేల్. గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు హార్ధిక్ పటేల్ తీవ్రంగా స్పందించారు. ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమేనని అన్నారు. పటేల్ పేరు మీద ఓట్లు అడిగిన మోడీ.. ఇప్పుడు ఉక్కుమనిషిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నుంచి విమర్శలు పెరగడంతో బీజేపీ కూడా కౌంటర్లకు దిగింది. పటేల్‌కి అవమానం జరిగిందనే కాంగ్రెస్ నాయకులు.. కనీసం ఆయనకు అతిపెద్ద విగ్రహం కడితే ఒక్కసారైననా ప్రశంసించారా..? అని ప్రశ్నించారు కేంద్రంమంత్రి రవిశంకర్ ప్రసాద్. కనీసం ఒక్కసారైన అక్కడికి వెళ్లి చూశారా అని అడిగారు. మరోవైపు ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్రమంత్రి జవదేకర్. మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి సర్దార్ పటేల్ పేరే ఉందని చెప్పారు. కేవలం ఒక్క స్టేడియానికి మాత్రమే మోడీ పేరు పెట్టినట్లు తెలిపారు. అయినప్పటికీ.. పేరు మార్పు మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ సాగుతున్నాయ్. మీమ్స్‌తో కొందరు మోడీని టార్గెట్ చేశారు.
స్టేడియం పేరుపైనే కాదు, అందులోని గ్యాలరీలకు పేర్లపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. నరేంద్రమోడీ స్టేడియంలో అదానీ ఎండ్, అంబానీ ఎండ్ అని పెట్టడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.