పురపోరు: కోర్టు కేసులతో ఎన్నికలు ఆగుతాయా..?

Deekshitha Reddy
మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు, మార్చి 14న రిజల్ట్. ఇదీ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్. అయితే గతంలోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి, వాటిని ఎక్కడ ఆపేశామో అక్కడినుంచే మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే దీనిపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు ప్రక్రియను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది.

పురపాలక ఎన్నికల నిర్వహణ  విషయంలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయ మూర్తి తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో, అక్కడి నుంచి ఎన్నికలను పెట్టాలన్న నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యాలకు అసలు విచారణార్హతే లేదని కోర్టులో వాదించారు ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయ వాది. కరోనా కారణంగానే గత మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేశామని, దీన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే అప్పుడు నిలిచిపోయిన ఎన్నికలను ఇప్పుడు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని అన్నారు.

మరోవైపు ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే పురపాలక ఎన్నికల ప్రక్రి యను పునరుద్ధరిస్తూ ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని తెలిపారు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్. ఈ ప్రక్రియను కొనసాగనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఎన్నికలను వాయిదా వేసేటప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్‌ స్పష్టంగా చెప్పిం దని గుర్తుచేశారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: