పురపోరు: శ్రీకాకుళంలో వైసీపీకి ఆ లీడర్ డ్యామేజ్‌ చేస్తున్నారా..?

Chakravarthi Kalyan
పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ దూసుకుపోయింది. ఆ ఫలితాల జోరు చూసే మున్సిపల్ సమరానికి కూడా సిద్ధపడింది. ఇప్పుడు పుర సమరం జరగబోతోంది. మొత్తానికి జిల్లాలో ఇప్పుడంతా ఎన్నికల సీజన్ నడుస్తోంది. వచ్చే నెల్లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ పోరులో పై చేయి సాధించిన వైసీపీ.. పనిలోపనిగా పురపాలకాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అయితే శ్రీకాకుళం  జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఓ నాయకుడి జోరు కాస్త మైనస్‌గా మారబోతోందంటున్నారు విశ్లేషకులు.  

ఇంతకీ ఎవరా నాయకుడు అంటారా.. ఆయనే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌.. ఇటీవల ఈ నాయకుడు వివాదాస్పదం అయినంతగా ఎవరూ కాలేదు. ఎమ్యెల్యేగా గెలవకపోయినా.. ఈ నాయకుడి జోరు పార్టీకి ఇబ్బందిగా మారుతోందట. ఆయన దూకుడుతో  వ్యవహరిస్తున్న తీరు పార్టీకి లాభం కంటే నష్టం చేకూర్చేవిధంగా ఉందంటున్నారు. ఇందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు వారు ప్రస్తావిస్తున్నారు.

మొన్నటి పంచాయతీ ఎన్నికల సమయంలోఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన హల్‌చల్‌ చేసిన వీడియోలు అన్ని ఛానల్లలోనూ ప్రసారమయ్యాయి. ఏకంగా ప్రత్యర్థులపైకి బ్యాట్లు, ఇనుప రాడ్లు చేతపట్టుకుని శివాలెత్తిపోవడం అవాక్కయ్యేలా చేసింది. తానే స్వయంగా అనుచరులను ఉసిగొల్పిన తీరు విస్తుగొలిపింది.

వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలతో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటే.. ఇలాంటి నేతల దూకుడు కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కొందరు పార్టీ నేతలు ఫీలవుతున్నారట. చీటికీ మాటికీ వివాదాలు...తన రూటే సపరేటు అన్నట్టుగా ప్రవర్తించడం జిల్లా పెద్దలకు సైతం రుచించటం లేదని ఆ పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.  ఇప్పుడు పుర పోరు సమయంలో ఇవన్నీ చర్చకు వస్తాయని.. ఎన్నికల సరళిపై ప్రభావం చూపుతాయని వారు భావిస్తున్నారట. మరి పురపాలక ఎన్నికల్లో ఈ నాయకుడి ప్రభావం ఎంతగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: