వైఎస్ఆర్ ఆఖరి కోరిక నెరవేరబోతోంది..!

NAGARJUNA NAKKA
రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. ఈ ఉగాది నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా నేతలకు, అధికారులకు సంకేతాలు ఇచ్చారు ముఖ్యమంత్రి.

రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్‌. ఏప్రిల్‌ 13న ఉగాది రోజు నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించడానికి  సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నవ రత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాల అమలు పైనే ప్రధానంగా దృష్టి సారించారు. ప్రభుత్వం ఏర్పడి ఈ మే నాటికి రెండేళ్లు పూర్తి అవుతుంది. దీంతో ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ప్రజలు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యలు వీటిపై ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని భావిస్తున్నారు.

వాస్తవంగా రచ్చబండ కార్యక్రమం దివంగత నేత వైఎస్ రాజశేఖర మానస పుత్రిక. 2009లో రెండో దఫా అధికార పగ్గాలు అందుకున్న తర్వాత అధికారులు, నేతల నుంచి స్వయంగా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. తన తండ్రి ప్రారంభించలేకపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని తాను కొనసాగించాలని నిర్ణయించారు జగన్.  

అయితే ఎక్కడ నుంచి ప్రారంభించాలి? కార్యక్రమం ఏ విధంగా ఉండాలి అనే అంశాల పై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఇవన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయని ప్రభుత్వ వర్గాల సమాచారం.

మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాడు. స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తన తండ్రి ప్రారంభించాలనుకున్న రచ్చ బండ కార్యక్రమం ఆచరణకు నోచుకోలేదు. రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ పావురాల గుట్టలో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రాజశేఖర్ రెడ్డి కల.. కలగానే మిగిలిపోయింది. ఆ కలను ఇపుడు తన వారసుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. అందులో భాగంగా రచ్చబండను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఆ కార్యక్రమంలో స్వయంగా ప్రజాసమస్యలను తెలుసుకోవడం.. ఆ సమస్యలకు అక్కడే పరిష్కారం కనుగొనేలా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: