మార్పులతో కోహ్లీసేన బరిలోకి..!
భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగితే స్టేడియాల్లో సందడి వాతావరణం ఉండేది. అభిమానులతో మైదానాలు కిక్కిరిసిపోయేవి. ఇక టికెట్ల కోసం అయితే రెండు మూడు రోజుల ముందే అభిమానులు స్టేడియాల కౌంటర్ల ముందు బారులు తీరేవారు. టికెట్ కోసం ఎన్నో కష్టాలు పడేవారు. టికెట్ దొరికిన వారు సంతోషంతో.. దొరకని వారు నిరాశతో ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఈ ఘటనలు చెన్నైలోని చెపాక్ మైదానం వద్ద చోటుచేసుకుంటున్నాయి.
భారత్‌లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచే చివరిది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 6 నెలలు ఆటలు నిలిచిపోయాయి. ఆపై ఐపీఎల్ 2020 యూఏఈలో జరగ్గా.. ఆస్ట్రేలియా పర్యటన కంగారూ గడ్డపై జరిగింది. ప్రస్తుతం భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్ జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం షరతులతో వీక్షకులకు అనుమతి ఇచ్చింది. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం వరకు టికెట్లు ఇస్తున్నారు. రెండో టెస్టు టికెట్ల పంపిణీని ఆరంభించారు స్టేడియం నిర్వాహకులు.
చెపాక్ స్టేడియంలో రేపటి నుంచి రెండో టెస్టు జరగనుంది. ఫస్ట్ టెస్ట్ ఓటమి అనంతరం టీమిండియా తుది జట్టు సెలెక్షన్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో భారత్ రెండో టెస్ట్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. రెండో టెస్టుకు స్పిన్‌కు బాగా సహకరించే పిచ్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించని స్పిన్నర్ నదీమ్‌పై పక్కకు పెట్టే అవకాశం కనిపిస్తుంది. గాయం కారణంగా తొలి టెస్టులో అరంగేట్రం చేయలేకపోయిన అక్షర్ పటేల్.. రెండో మ్యాచ్‌లో నదీమ్ స్థానంలో జట్టులోకి వచ్చే వీలుంది. అలాగే కుల్‌దీప్ యాదవ్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలను కొట్టిపారేయలేమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇక తొలి టెస్టులో నదీమ్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. మ్యాచ్‌ని ప్రభావం చూపలేక పోయాయి. 59 ఓవర్లు వేసిన అతను 233 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక తొమ్మిది నోబాల్స్ వేశాడు. ఓ స్పిన్నర్ ఇలా నోబాల్స్ వేయడంపై జట్టు మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉంది.