అతడు చేయలేడు కాబట్టే.. ఆమే చేతితో చేసింది..!
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు రైతులు. జనవరి 26న ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా.. కొందరు నిరసనకారులు పోలీసులు నిర్దేశించి మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో ఢిల్లీకి ప్రవేశించారు. పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలతో పాటు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడులకు దిగారు. ఎర్రకోటపై జెండా ఎగురవేశారు.
అయితే రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లడంలో దీప్ సిద్దూ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. జనవరి 25న కూడా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని.. ఆయన వల్లే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారని ఆరోపణలు వచ్చాయి. రైతు సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఆ మరుసటటి దీప్ సిద్దు స్పందించారు. ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ ప్లాగ్‌ను మాత్రమే ఎగురవేశామని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని తొలగించలేదని, ఖాళీ పోస్ట్‌పైనే జెండాలు ఎగురవేశామని చెప్పారు. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నుంచి దీప్ సిద్దు కనిపించకుండా పోయాడు.
ఈ హింసకు సంబంధించి పలు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల జాబితాను సిద్దం చేశారు. ఇప్పటికే 100 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఎర్రకోట వద్ద జెండాలు ఎగురవేసిన దీప్ సిద్దూ, జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్‌ల గురించి సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు. దాదాపు 15 రోజులుగా పరారీలో ఉన్న దీప్ సిద్ధూనూ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
సిద్దూ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణలో అతని గర్ల్‌ఫ్రెండ్ కీలక పాత్ర పోషించిందని గుర్తించారు పోలీసులు. అజ్ఞాతంలో ఉన్న దీప్ సిద్ధూకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది గర్ల్‌ఫ్రెండేనని నిర్థారించుకున్నారు. విదేశాల్లో ఉన్న ఆమె సిద్ధూ ఫేస్‌బుక్ ఖాతాను నిర్వహిస్తోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాలిఫోర్నియోలోని ఫ్రెండ్‌కి సిద్దూ వీడియోలు పంపుతాడని.. అక్కడ ఆ వీడియోలు అప్‌లోడ్ చేస్తారని గుర్తించినట్టు స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు. అందువల్లే తాము అతని ప్రస్తుత ఐపీ అడ్రస్ ను గుర్తించలేకపోయామని తెలిపారు.