జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్ ప్లాన్..?
మీడియాతో మాట్లాడిన బొత్స.. మంత్రి పదవి ఎన్నిసార్లు చేశామన్నది ముఖ్యం కాదని, ప్రజలకు కావాల్సిన పనులు చేయాలన్నారు. అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవంతో చేసిన ఒక్క మంచి పనైనా ఉందా..? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరామతీర్థసాగర్ నుంచి నీరు తీసుకురావాలని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రయత్నించామన్నారు.
గత టీడీపీ ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టును నిలిపేసిందన్నారు. శ్రీరామతీర్థ సాగర్ ద్వారా విజయనగరానికి నీళ్లు తీసుకొస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రతిపక్షాలు పనికిరాని విమర్శలు ఎన్ని చేసినా పట్టించుకోమని, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని గుర్తుచేశారు. మోసం, దగా లేకుండా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి బొత్స అన్నారు. మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ రాదని, జరిగే మంచిని కూడా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం సిగ్గుచేటని మంత్రి బొత్స అంటున్నారు.
ఇక విజయనగరం జిల్లాలో ఎన్నికల వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల విజయనగరం జిల్లా ను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. రెండో దశలో ఈ జిల్లాలోని పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో రెండోదఫా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 15 మండలాల్లో415 పంచాయతీలు,3908 వార్డుల్లో రెండో దఫాలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో బాడంగి, బలిజపేట,బొబ్బిలి, గురుగుబిల్లి, గుమ్మ లక్ష్మిపురం, జియ్యమ్మవలస, కొమరాడ,కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రాపురం, సాలూరు,సీతానగరం, తెర్లాం మండలాల్లో రెండో దఫాలో ఎన్నికలు జరగనున్నాయి.