జగడ్డ: పట్టాభిపై దాడి వెనుక మంత్రి హస్తంపై...?
ఈ ఘటనలో దుండగులు పట్టాభి కారును పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే పట్టాభి మాత్రం స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న టిడిపి నేతలు హుటాహుటిన పట్టాభి నివాసం వద్దకు చేరుకొని పరామర్శించారు. ఈ దాడికి పాల్పడింది ఖచ్చితంగా ఏపీ అధికార పార్టీ నేతలే అంటూ ఆరోపణలు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, ముంత్రులే ఈ దాడి చేయించారని గతంలో ఓ సారి దాడి జరిగినా పోలీసులు ఇసుమంతయినా పట్టించుకోలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇలా తమపై దాడులకు దిగుతున్నారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు. పట్టాభిని పరామర్శించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్.. తన బూతుల మంత్రులతో పట్టాభిపై దాడి చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నించిన వారందరినీ చంపేస్తారా..? అయితే నన్ను కూడా చంపేయండంటూ అధికార పార్టీ పై నిప్పులు చెరిగారు. ఓ రకంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు.
ఇందుకు స్పందించిన కొడాలి నాని టిడిపి నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని... రాజకీయ లబ్ది కొరకు తమపై తామే దాడులు జరుపుకుంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ... ఈ నాటకాలు ఆడటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండబోదని, ప్రజలు అంత అమాయకులు కాదని వ్యాఖ్యానించారు కొడాలి నాని. మరో వైపు పట్టాభిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడె ప్రసాద్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, వీరి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది..!