ఎంత ఇష్టపడి కొన్నా.. స్క్రాప్ కిందకే వస్తుంది..!

NAGARJUNA NAKKA
కాలం చెల్లిన వాహనాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన వాహనాలను... తుక్కుగా మార్చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల్లో కొత్త పాలసీని ప్రకటించనుంది. మీ వాహనం సూపర్‌ కండిషన్‌లో ఉన్నా... 15 ఏళ్లు దాటితే స్క్రాప్‌ కింద మార్చేయాల్సిందే.

కాల చెల్లిన వాహనాలతో... పట్టణాల్లో వాయుకాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన టూ వీలర్స్‌, కమర్షియల్ వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాహనాల కాలపరిమితి ముగిస్తే... వాటిని తుక్కుగా మార్చేయాలని ప్రభుత్వం తెలిపింది. పాత వాహనాలను స్క్రాప్‌గా విక్రయిస్తే... కొత్త వాటిని కొనుగోలు చేసేటపుడు రాయితీలు ఇవ్వనుంది. త్వరలోనే వెహికల్ స్క్రాపేజీ పాలసీని తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

స్వచ్ఛంద వాహన తుక్కు విధానంతో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల జీవిత కాలం, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే విధానంలో దాదాపు కోటి తేలికపాటి, మధ్య, భారీ వాహనాలు ఉన్నాయి. ఇందులో 51 లక్షల వెహికల్స్‌ 20 ఏళ్లకు పైబడినవి నడుస్తున్నాయి. మరో 34 లక్షల వాహనాలకు 15 ఏళ్లు పూర్తయ్యాయి. తెలంగాణలో లక్షల్లో పాత వాహనాలున్నాయి. ఈ వాహనాలకు ఎలాంటి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేవు. 15 రోజుల్లో కొత్త విధానాన్ని ప్రకటించనుంది కేంద్రం. కాలం చెల్లిన వాహనాల స్క్రాప్‌ వెళ్లడం ద్వారా... కొత్త వాహనాలకు డిమాండ్‌ పెరగనుంది. ట్యాక్స్‌ల రూపంలో కేంద్రానికి ఆదాయం సమకూరనుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించనుంది.

వాహనాన్ని తుక్కు చేసినట్లు సర్టిఫికెట్‌ చూపిస్తే... కొత్తగా కొనుగోలు చేసే వాటికి ట్యాక్స్‌ల రూపంలో రాయితీ లభించనుంది. కేంద్రం కూడా ఒక శాతం రాయితీ ఇవ్వనుంది. రోడ్‌‌ ట్యాక్స్‌‌, రిజిస్ట్రేషన్‌‌ ఫీజు మినహాయింపు ఇచ్చే చాన్స్ ఉంది. ఇందుకోసం రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటీ ముప్పై లక్షల వాహనాలుఉన్నాయి. 30 లక్షల వరకు 15 ఏళ్లు దాటినవి ఉంటాయని అధికారులు చెప్తున్నారు. టీఎస్ఆర్టీసీలో 15 ఏళ్లు పూర్తయిన బస్సులు వెయ్యికి పైగా ఉన్నాయి. మరో ఐదారు నెలల్లో 300 నుంచి 400 వరకు బస్సులు కాలం చెల్లనున్నాయి. కొత్త పాలసీ వస్తే ఈ పాత వెహికల్స్ అన్నీ స్క్రాప్‌కు వేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: