నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

VUYYURU SUBHASH
రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఉగ్ర‌రూపం దాల్చారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫి కేష‌న్ విడుద‌ల చేసిన త‌ర్వాత కూడా త‌న ఆదేశాల‌ను ధిక్క‌రించిన ఉన్న‌తాధికారుల‌పై ఆయ‌న కొర‌డా ఝ‌ళిపించారు. దీనిని అంద‌రూ ఊహించిన‌ప్ప‌టికీ.. ఈ రేంజ్‌లో ఆయ‌న చ‌ర్య‌లు ఉంటాయ‌ని మాత్రం ఊహించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ముందు నుంచి కొత్త ఓట్ల‌ర్ల‌తో కూడిన జాబితాను సిద్ధం చేయాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌డ్డ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా షెడ్యూల్ విడులైన త‌ర్వాత‌.. దానికి త‌గిన‌విధంగా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తోనూ స‌మావేశాలు నిర్వ‌హించి.. ఏర్పాట్లు చేయాల‌ని కూడా పేర్కొన్నారు.

అయితే.. ఈ ఆదేశాల‌ను పాటించ‌డంలోను, అమ‌లు చేయ‌డంలోను.. సీనియ‌ర్ అధికారులు పంచాయ‌తీ రాజ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి గోపాల‌కృష్ణ ద్వివేదీ, అదేశాఖ క‌మిష‌న‌ర్ గిరిజా శంక‌ర్‌లు నిర్ల‌క్ష్యం వ‌హించా ర‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లకు సంబంధించిన మీడియా స‌మావేశంలో నిమ్మ‌గ‌డ్డ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. వారు స్పందించ‌లేదు. ఫ‌లితంగా రాష్ట్రంలో 3.6 ల‌క్ష‌ల మంది కొత్త ఓట‌ర్లు.. ఓటు హ‌క్కును కోల్పోయారు. దీంతో కొంద‌రు హైకోర్టును కూడా ఆశ్ర‌యించారు.

ఇది తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌.. తాను చెప్పిన ప‌నిని చేయ‌డంలో విఫ‌ల‌మైన అధికారులు ఇద్ద‌రిపైనా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంక‌ర్‌లు ఇద్ద‌రూ కూడా విధులు నిర్వ‌హ‌ణ‌కు అన‌ర్హులుగా పేర్కొన్నారు. వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇక్క‌డితోనూ నిమ్మ‌గడ్డ ఆగ‌కుండా.. వీరి నిర్ల‌క్ష్యాన్ని, విధుల్లో చూపిన అల‌స‌త్వాన్ని వారి స‌ర్వీసు రికార్డుల్లోనూ న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. ఇదే జ‌రిగితే..  స‌ద‌రు అధికారుల‌కు భ‌విష్య‌త్తులో అనేక చిక్కులు ఎదురు కావ‌డంతోపాటు.. ప‌దోన్న‌తుల విష‌యంలోనూ, కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంలోనూ అన‌ర్హులు అవుతారు.

ప్ర‌స్తుతం నిమ్మ‌గ‌డ్డ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అధికారులు, ప్ర‌భు్త్వంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఉన్న‌త‌స్థాయి అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరును గ‌తంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా వ్య‌వ‌హ‌రించిన వారుసైతం త‌ప్పుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు వీరిని ఎవ‌రూ కాపాడ‌లేర‌నే వాద‌న బ‌లంగావినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: