టీటీడీ రేసులో సినీ ప్రముఖులు..

Chakravarthi Kalyan
మరికొన్నిరోజుల్లో తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ ఖాళీకానుండటంతో .. ఆ పదవికి పోటీ తీవ్రమైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో వివిధ నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగారు. అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా ఛైర్మన్ పీఠం కైవశం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. సినిమా రంగం నుంచి కూడా టిటిడి ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. చంద్రబాబుకు సన్నిహితులైన కె.రాఘవేంద్రరావు ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయన చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ ప్రచార చిత్రాల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ కూడా టిటిడీ ఛైర్మన్ రేసులో ఉన్నారు. ఈయన ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి నుంచి గెలిచి ఎంపీ అయ్యారు. ఎలాగైనా టీటీడీ ఛైర్మన్ కావాలని పట్టుదలతో ఉన్నారట. మురళీ మోహన్ తో పాటు మరో ప్రముఖ నిర్మాత రామానాయుడు కూడా టీటీడీ ఛైర్మన్ పరుగులో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పార్టీ తరవున ఎంపీగా పనిచేసిన అనుభవం రామానాయుడుకు ఉంది. ఈ ముగ్గురు సినీప్రముఖులతో పాటు పలువురు రాజకీయనేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిలో ముందు వరుసలో ఉన్నది స్థానిక నేత, మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి. ఈయనకు ఎన్నికల సమయంలో తనకు టిక్కెట్ ఇవ్వనందుకు బదులుగా ..టిటిడి ఛైర్మన్‌ పదవి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారట. బాబు ఎలాగైనా హామీ నిలబెట్టుకుంటారని నమ్ముతున్నారు. ఈయన కాకుండా చిత్తూరుజిల్లాకే చెందిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా టిటిడి ఛైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఛైర్మన్‌ పీఠం కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంకా తెలుగు యువత మాజీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌, విశాఖ మాజీ ఎంపి ఎం.వి.ఎస్.ఎస్.మూర్తి కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: