ఏపీ రాజకీయాలు ఆయన వ్యాఖ్యలతో యూ టర్న్ తీసుకుంటాయా...?
ఈయన మైకు ముందు కుర్చున్నారంటే ప్రజలను తన మాటలతో మలుపు తిప్పగల నేర్పరి, అయితే ఈయన ఎంత మాట్లాడినా, ప్రభుత్వం గురించి ఎంత విమర్శించినా చివరికి ప్రజలంతా తన స్నేహితుడి కొడుకుని సమర్ధిస్తున్నారనే అంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత రాష్ట్ర సమస్యపై ఈయన మాట్లాడడం ఇప్పుడు అందరిలోనూ చర్చకు తెరలేపింది. ఇలాంటి సందర్భంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఎప్పుడూ లేనంతగా మన రాష్ట్రంలో మతపరమైన రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రస్తుతం పెట్రేగిపోతున్న ఆలయ విద్వంస కారులను మొదట్లోనే పట్టుకుని ఉంటే, ఇంతటి సమస్యలు ఉండేవి కాదని ఈ సందర్భంగా అధికార పార్టీపై విమర్శలు చేశారు.
పోలీసులు ఇచ్చిన మాటలు ఏమయ్యాయని, రామతీర్థం ఘటనపై విచారణ ఏమైందని...దీనికి కారణమైన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారో పోలీసులు సమాధానం చెప్పాలని తన స్టైల్లో చెలరేగిపోయారు. అయినా ఘటన జరిగిన తరువాత ఒకేసారి అధికార మరియు ప్రతిపక్ష నాయకులు వెళ్లకుండా ఉండాల్సిందని విజయ సాయి రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ విధంగా సాగిన ఈయన సంభాషణలు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాయి...? మరియు ఎవరిని విమర్శిస్తున్నారో అర్ధం కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో ఈయన చేసిన వ్యాఖ్యల తరువాత కొంతవరకు మార్పు జరిగే అవకాశముందని...అయితే అది మంచికా లేదా చెడుకా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇక చంద్రబాబు రామతీర్థంలో పర్యటించిన రోజే.. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. బాబుకు పోటీగా వెళ్లారా? అని ప్రశ్నించారు. మొత్తంగా ఉండవల్లి వ్యాఖ్యలు ఎవరిని సమర్ధిస్తున్నాయో.. ఎవరిని ఏకుతున్నాయో.. ఇతమిత్థంగా అర్ధం కాకపోయినా.. ఇప్పటి వరకుఉన్న పరిణామాలను మాత్రం మలుపుతిప్పేవిగా ఉండడం గమనార్హం అంటున్నారు పరిశీలకులు.