ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి..!

N.ANJI
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఏకంగా 11 మంది ప్రాణాలు విడిచారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరోసారి కొండచరియలు విరిగిపడటంతో సిబ్బంది కూడా చిక్కుకున్నట్లు సమాచారం.
ఈ ఘటన శనివారం సాయంత్రం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో చోటు చేసుకుందని ఇండోనేషనియన్‌ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (బీఎన్‌పీబీ) వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టి మృతులు, క్షతగాత్రులను వెలికి తీశామన్నారు.
ఇండోనేషియా రాజధాని జకర్తాకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలోని చిహన్‌జువాంగ్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయని బీఎన్‌పీబీ ప్రతినిధి రాదిత్య జతి పేర్కొన్నారు. కొండ చరియలు విరిగిపడ్డాయని తెలియడంతో స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. 11 మంది మరణించారని, 18 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు.
బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్న సమయంలో (రాత్రి 7.30 గంటలకు) మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయని ఆయన పేర్కొన్నారు. దీంతో పలువురు సహాయక సిబ్బంది కూడా కొండచరియల కింద చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షం, వరదల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని బీఎన్‌పీబీ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ఇండోనేషియాలో తరచూ వర్షాలు, వరదలు చోటు చేసుకుంటున్నాయని అందరికీ తెలిసిందే. వర్షాలు తగ్గేంతవరకు సహాయక చర్యలు చేపట్టడం కుదరదని వారు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: