హైదరాబాద్‌లో ఈ ప్లేస్ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్ అయినట్టే..?
పాతబస్తీలోని ప్రఖ్యాత చార్మినార్, మక్కా మసీదులకు కూతవేటు దూరంలోనే ఉన్నా.. ఈ ప్యాలెస్‌కు దక్కాల్సినంత ప్రాముఖ్యత దక్కలేదేమో అనిపిస్తుంది. హైదరాబాద్‌ను పాలించిన అసఫ్‌జాహీ వంశస్తులు నివసించిన రాజ ప్రాసాదాల సముదాయమే ఈ చౌమహల్లా ప్యాలెస్. సువిశాల ప్రాంగణంలో కొలువుదీరిన నాలుగు రాజప్రాసాదాలు ఆనాటి నవాబుల రాజసానికి ఇప్పటికీ దర్పణంగా నిలుస్తాయి. మొదటి అసఫ్ జాహీ పాలకుడి నుంచి చిట్టచివరి నిజాం రాజుల వరకూ అందరి చరిత్ర ఇక్కడ కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
రాజసం ఉట్టిపడే భవనాలు.. ఆ భవనాల్లో ఆనాటి రాజులు, రాజకుటుంబీకులు ఉపయోగించి వస్తువులు, ఆనాటి ఆయుధాలు, నవాబులు ఉపయోగంచిన వాహనాలు.. ఇలా ఈ కోటలో మనల్ని ఆశ్చర్యపరిచేవి ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజుగా అప్పట్లో టైమ్స్ మేగజైన్‌పై ముఖచిత్రం వచ్చిందంటే అప్పటి రాజసం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఆనాటి నిజాంలు వాడిన కార్లు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. చౌమహల్లా ప్యాలెస్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ సందర్శించవచ్చు. శుక్రవారం, పబ్లిక్ హాలీడేస్‌లో మూసేస్తారు. పెద్దలకు రూ. 60, పిల్లలకు రూ. 20 ఎంట్రీ ఫీజు.
ఇక్కడి మరో విశేషం ఏంటంటే.. కోట ఆరంభంలోనే ఓ ఫోటో స్టూడియో ఉంటుంది. ఇక్కడ సందర్శకులు నవాబుల వేషధారణలో ఫోటోలు దింపుతారు. ఒక్కో ఫోటోకు రూ.100 ఫీజు తీసుకుంటారు. ఇక ఇక్కడి ఖురాన్ ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంగుళం పరిమాణం నుంచి మనిషి ఎత్తు పరిమాణం ఉన్న ఖురాన్‌లు ఇక్కడ చూడొచ్చు. ఎన్నో విశిష్టతలు ఉన్న ఖురాన్‌లు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక నవాబుల చరిత్రను వివరించేలా ఓ మ్యూజియం షాప్ కూడా ఉంది. ఇందులో నవాబుల చరిత్రను వివరించే పుస్తకాలు..నిజాం కాలం నాటి నగలను పోలిన నగలను, చిత్రపటాలను విక్రయిస్తారు.
అయితే కొవిడ్ కారణంగా పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిందని.. ఒకప్పుడు రోజుకు 3000 మంది పర్యాటకు వచ్చేవారని.. ఇప్పుడు 200-300 మంది మాత్రమే వస్తున్నారని ఈ షాపు నిర్వాహకుడు ఫైజాన్ తెలిపారు. మీరు హైదరాబాద్‌లోనే ఉంటే.. తప్పక చూడాల్సిన ప్రదేశం చౌమహల్లా ప్యాలెస్.