తగ్గింది కదా అని లైట్ గా తీసుకుంటున్నారా.. మీ పని మటాషే..?
ఈ రెండు, మూడు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తికి చలిగాలుల తీవ్రతతో పాటు జనం నిర్లక్ష్యం కూడా తోడవుతోంది. అందుకే అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణలు. ఎందుకు అంతగా చెప్పుకోవాల్సివస్తుందంటే.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పది రోజుల కిందట 30 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కానీ.. తాజాగా ఆ సంఖ్య 100కి పెరిగింది. మూణ్నాలుగు రోజుల వ్యవధిలోనే వైరస్ సోకిన వారు 50 మందికిపైగా ఉన్నారట.
అంటే.. ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య ఉన్నట్టుండి రెట్టింపవుతోంది. ఇది మరోసారి కరోనా రెచ్చిపోబోతోందనే దానికి ఉదాహరణగా చెబుతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో తొలి కొవిడ్ కేసు 2020 మార్చి 2న నమోదు కాగా.. ఆ నెలలో 97 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇక అప్పటి నుంచి కేసులు ఓ మోస్తరుగా పెరుగుతూ వచ్చాయి. సెప్టెంబరు వరకూ కరోనా జోరు కొనసాగింది. ఆ తర్వాత జోరు తగ్గింది. ఆగస్టులో 65,903 కేసులొస్తే.. అక్టోబరులో 46,448, నవంబరులో 30,270, డిసెంబరులో 23,191 కేసులు వచ్చాయి.
ఇక తెలంగాణలో డిసెంబరు 30న 461 పాజిటివ్‌లు కేసులు వస్తే.. జనవరి 2వతేదీ 394, 3న 238, 4న 253 కేసులొచ్చాయి. ఇక 5వ తేదీన ఏకంగా 417కు పెరిగాయి. రెండు,మూడు రోజుల వ్యవధిలోనే సరాసరిన సుమారు 30శాతం పెరిగాయన్నమాట. ఇలాంటి పెరుగుదల ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.