ఐటీ రంగంలో భాగ్యనగరం భేష్..!

NAGARJUNA NAKKA
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో భాగ్యనగరం దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలకు అడ్డాగా నిలిచిన హైదరాబాద్‌.. ఐటీ ఉత్పత్తుల్లోనూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అటు మల్టీ నేషనల్‌ కంపెనీలు నగరాన్ని తమ పెట్టుబడులకు స్వర్గధామంగా చూస్తున్నాయి. అందుకే ఐకియా, అమెజాన్‌, వన్‌ప్లస్‌, గూగుల్‌ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఇక్కడే పెట్టుబడులు, క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.

హైదరాబాద్‌ ఐటీ రంగం వాటా ప్రస్తుతం లక్షా పది వేల కోట్లు. దేశవ్యాప్తంగా ఐటీ రంగం వృద్ధిరేటు 7 శాతం కాగా... తెలంగాణలో మాత్రం రెండింతలు.. అంటే 15 శాతంగా ఉంది. 2014లో 65వేల కోట్లుగా ఉన్న ఐటీ ఉత్పత్తులను 2020 నాటికి రెండింతలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడమే కాదు... సాధించి చూపించింది. కరోనా కష్టకాలంలోనూ ఐటీ ఎగుమతుల్లో వరుసగా ఐదోసారి దేశంలో ప్రథమస్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను తెలంగాణ ఐటీ  ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించింది. 2018-19లో ఐటీ ఎగుమతులు లక్షా 9 వేల 219 కోట్ల రూపాయలు కాగా.. 2019-20లో లక్షా 28 వేల 807 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో ఐటీ రంగానికి ఉన్న సానుకూల వాతావరణంతో... బెంగళూరును అధిగమించింది.

రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తుండగా.. వీరిలో 95 శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. వీరికి అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఆయా సంస్థలు కేవలం నాలుగైదు రోజుల్లోనే సమకూర్చడం హైదరాబాద్‌ ఐటీ రంగానికి ఉన్న బలాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు . ప్రస్తుతం చైనాపై ప్రతికూల ధోరణి పెరుగుతుండటంతో అక్కడి ఐటీ కంపెనీలు ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో దేశీయ ఐటీ రంగం సాధించిన పురోగతి మూలంగా చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ మారొచ్చని చెబుతున్నారు. పోలాండ్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు పోటీ పడుతున్నా అక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు పరిమితంగానే ఉన్నాయి. హైదరాబాద్‌ పెట్టుబడుల ఆకర్షణలో ముందువరుసలో నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో ఇక్కడి ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపడాలి. ఇప్పటికే నగర శివార్లలోని ఉప్పల్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు, ద్వితీయ శ్రేణి నగరాలకు ఈ రంగాన్ని విస్తరించేలా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: