ప్రపంచంలో నెంబర్-2 హైదరాబాద్.. ఇంతకంటే ఇంకేం కావాలి..

Deekshitha Reddy
దేశవ్యాప్తంగా చేపట్టే సర్వేలలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది. అదే ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో మన హైదరాబాద్ కూడా ముందుంది అంటే.. అది మరింత విశేషం. అంతకు మించి అన్నట్టుగా.. హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్త సర్వేలో నెంబర్ 2 స్థానంలో నిలవడం మరింత ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన విషయం. అవును.. ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో లండన్, బీజింగ్ ని సైతం వెనక్కు నెట్టి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇదే లిస్ట్ లో ఫస్ట్ పేరు చెన్నై కావడం మరింత విశేషం.

ప్రపంచంలోనే అత్యధికంగా సీసీ కెమెరాలు వినియోగిస్తున్న మొదటి పది నగరాల్లో హైదరాబాద్ ‌కు స్థానం లభించింది. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సేవలు అందించే ‘సర్ఫ్‌ షార్క్‌’ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సీసీ కెమెరాల వినియోగానికి సంబంధించి నివేదిక రూపొందించింది. దీని ప్రకారం సీసీ కెమెరాల సాంద్రత, అంటే చదరపు కిలోమీటర్‌ కు ఉన్న కెమెరాల సంఖ్య ప్రకారం హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. మొదటిస్థానంలో నిలిచిన చెన్నై కూడా దక్షిణాది నగరమే కావడం విశేషం. ఇక రెండో లిస్ట్ లో హైదరాబాద్ కి ఎనిమిదో స్థానం దక్కింది. జనాభా నిష్పత్తి ప్రకారం,  ప్రతి వెయ్యి మంది జనాభాకు ఏర్పాటయిన కెమెరాల ప్రకారం చూస్తే హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. ఈ రెండు అంశాల్లోనూ మన దేశానికి చెందిన మూడు నగరాలు మొదటి పది స్థానాల్లో ఉండటం గమనార్హం.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 6.65 లక్షల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 6లక్షల వరకు కేవలం హైదరాబాద్ ‌లోనే ఉన్నాయి. 2021 చివరి నాటికి తెలంగాణలో సీసీ కెమెరాల సంఖ్య 13 లక్షలకు, హైదరాబాద్‌లో 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది సాధ్యపడితే.. సీసీ కెమెరాలు అత్యధికంగా వినియోగిస్తున్న ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ‌ సీసీ కెమెరాల వినియోగం పెరగడం వల్ల కేసుల దర్యాప్తు సులభం అవుతోందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. గతేడాది తెలంగాణ వ్యాప్తంగా 4,490 కేసులను సీసీ కెమెరాల్లో నమోదయిన దృశ్యాల వల్ల త్వరగా ఛేదించగలిగారు పోలీసులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: