
ఆనంకు జగన్ మళ్లీ షాక్... వెంకటగిరిలోనూ పిడేశారుగా...!
తిరుపతి పార్లమెంటు స్ధానానికి త్వరలోనే జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టారు. అయినా కొందరు ఎమ్మెల్యేలపై ఆయనకు అనుమానాలు ఉన్న నేపథ్యంలో వారిని నమ్మడం లేదట. ముఖ్యంగా పదే పదే అసంతృప్తి గళం వినిపిస్తోన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై జగన్‌కు ఉన్న అప నమ్మకమో ఏమో గాని వెంకటగిరిలో మాత్రం ఈ ఉప ఎన్నిక బాధ్యతలను ఆయనకు ఇచ్చేందుకు జగన్ ఎంత మాత్రం ఇష్టంగా లేరట.
ఆ మాటకు వస్తే వెంకటగిరిలో మాత్రమే కాదు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు లాంటి చోట్ల పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తులు ఉన్నాయి. అయితే వెంకటగిరిలో మాత్రం జగన్ చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి పెడ్డిరెడ్డిని పర్యవేక్షణకు నియమించడంతో పాటు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు, అదే జిల్లాకు చెందిన మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది.
చివరకు నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు వెంకటగిరి మున్సిపాల్టీలో కూడా ఎన్నికల బాధ్యతలను స్థానిక నేతలెవ్వరికి ఇవ్వడం లేదని.. ప్రధానంగా చిత్తూరు జిల్లా వాళ్లకే అప్పగించాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఏదేమైనా ఆనంకు మరోసారి జగన్ మార్క్ షాక్ అయితే తప్పడం లేదు. ఆయన అసంతృప్తి, నోరు తూలడమే ఆయన ప్రాధాన్యాన్ని పార్టీలో పూర్తిగా తగ్గించేసింది.