హైదరాబాద్: తెలంగాణ అంశం తెరపైకి రాగానే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంటాడు. తెలం‘గానం’అనగానే లగడపాటి అక్కడ వాలిపోయి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఓ ప్రాంతంలోని ఓ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు ల(జ)గడపాటి రాష్ర్ట నేతగా కేంద్రానికి నివేదికలిస్తుంటాడు. తనకు సంబంధంలేని విషయాల్లో వేలే కాదు కాళ్లు కూడా పెడుతూ తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ లగడపాటి...తాజాగా నగరంలోని ఉస్మానియ విశ్వవిద్యాలయాన్ని మూసివేయాలంటున్నాడు. ఉస్మానియాను మూసివేస్తే తెలంగాణ ఉద్యమం అనేది ఉండదనేది లగడపాటి అభిప్రాయం. ఉస్మానియ విద్యార్థుల వల్లనే తెలంగాణ ఉద్యమం నడుస్తుందనీ...విద్యార్థులు లేకుంటే తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందనీ రాజగోపాల్ వాదన.
ఉస్మానియ విద్యార్థులు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారనీ, వీరు లేకుంటే రాష్ర్టమంతా ప్రశాంతంగా ఉంటుందంటూనే....మరోవైపు భీమవరం వెళ్లి విద్యార్థులు, యువత అందరూ సమైక్యంగా ఉండి ఉద్యమిస్తే విభజన డిమాండు చేస్తున్న వారు పారిపోతారనీ పిలుపునివ్వడం ఇది ఏ రాజనీతో ఆయనే చెప్పాలి. ఓ వైపు ఉస్మానియ విద్యార్థుల వల్లనే తెలంగాణ ఉద్యమం నడుస్తుందనీ...ఉస్మానియ నుంచి ప్రజల్ని భయానికి గురి చేస్తున్నారనీ....దీనిని సాకుగా చూపెట్టి ఉస్మానియ విద్యాలయాన్ని మూసివేయాలంటున్న లగడపాటి....సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. లగడపాటి వ్యాఖ్యల్ని తెలంగాణవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. లగడపాటిపై తెలంగాణవాదులు మండిపడటానికి ఇలాంటి వ్యాఖ్యలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అయితే, లగడపాటి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఇప్పటికిప్పుడు పుట్టుకువచ్చింది కాదు. గత ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమం సాగుతూనే వుంది. ఎంతో మంది తమ ప్రాణాల్ని త్యజించారు. ఉస్మానియాలో ఉన్న విద్యార్థుల వయసు మూడు పదులు కూడా దాటలేదు. కానీ, ఉద్యమానికి ఐదు దశాబ్దాల చరిత్ర వుంది. ఉస్మానియాలో ఉన్నది వేల మంది కావచ్చు, పాల్గొనేది మాత్రం వందల సంఖ్యల్లోనే ఉంటారు. తెలంగాణ కోసం ఆదిలాబాద్ అటవీ ప్రాంతం నుంచీ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ వరకు ప్రతి ఒక్కరూ కొట్లాడుతున్నారు. తెలంగాణ కావాలనీ అందరూ కోరుకుంటున్నారు. ఒక ఓయూను మూసివేయించినంత మాత్రాన తెలం‘గానం’ఆగిపోతుందనుకుంటే లగడపాటి భ్రమనే అవుతుందనీ తెలంగాణవాదులంటున్నారు. గత నెల 30న నిర్వహించిన తెలంగాణ మార్చ్ కు ఓయూ నుంచీ ఒక విద్యార్థిని కూడా పోలీసులు బయటకు రానివ్వలేదు. మార్చ్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు.
లక్షలాది మంది ముళ్లకంచెల్ని,లాఠీఛార్జీలను, పోలీస్ బాష్పవాయువులను దాటుకుని వచ్చారు. ఇలా చెప్పుకుంటే పోతే తెలంగాణ కోసం లక్షలాది మంది రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రాణాలిచ్చిన చరిత్ర వుంది. కానీ, వాస్తవాలు తెలుసుకోకుండా లగడపాటి లాంటి నేతలు ఉద్యమాల్ని, ప్రజల్ని కించపర్చి మాట్లాడినన్ని రోజులూ ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. ఉద్యమకారులు పుట్టుకొస్తుంటూనే ఉంటారు. నిర్భందం ఎంత ఎక్కువగా అమలు చేస్తే ఉద్యమం అంతకు రెట్టింపవుతోంది. ఏది ఏమైనా లగడపాటి వ్యాఖ్యలు తెలంగాణవాదుల్లో మరింత ఐక్యమత్యానికి తోడ్పడుతుందే తప్ప ఉద్యమాన్ని ఎంత మాత్రం నీరుగార్చలేదు. ఎందుకంటే వేర్వేరుగా ఉంటున్న తెలంగాణ ఉద్యమకారులు మళ్లీ ఒకటవుతున్నారు.
అణచివేత, మూసివేత వల్ల ఉద్యమాలు ఆగవు. ఇది మనం చెబుతున్నది కాదు చరిత్ర చెబుతున్న నగ్న సత్యం. ఒక వీరుడు నేలకొరిగితే వందలాది మంది వీరులు పుట్టుకువస్తారు. ఒక ఉస్మానియాను మూసివేస్తే తెలంగాణలోని పల్లెపల్లెన ఓ ఉస్మానియా పుట్టుకువస్తది.
మరింత సమాచారం తెలుసుకోండి: