పంది అవశేషాలు అందుకు వాడారా..?
కరోనా దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచదేశాలు.. వ్యాక్సిన్ వచ్చేయడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. చాలా దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పుడో న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. వ్యాక్సిన్ తయారీలో పంది అవశేషాలు వినియోగిస్తున్నారనే వార్త.. కొన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
కరోనా వ్యాక్సిన్‌లో పిగ్ ఎలిమెంట్స్ ఉన్నాయనే ప్రచారంతో... ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో ముస్లిం సంఘాల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముస్లింలు వ్యాక్సిన్‌ను వేసుకుంటారా? లేదా? అనే అనుమానం మొదలైంది.
సాధారణంగా వ్యాక్సిన్స్ తయారీలో పంది జెలటిన్ ను వాడుతుంటారు. ఈ జెలటిన్ వల్ల వ్యాక్సిన్ రవాణా, స్టోరేజ్ లలో ఇబ్బంది తలెత్తకుండా ఉండటంతో పాటు.. వ్యాక్సిన్స్ సేఫ్‌గా ఉంటాయి. అయితే, కొన్ని మందుల తయారీదారులు.. దీనికి ప్రత్యామ్నాయంగా చేపల జెలటిన్ కూడా వాడుతుంటారు. కానీ,చాలా సంస్థలు నాణ్యత విషయంలో పంది జెలటిన్ వైపే మొగ్గుచూపుతుంటాయి.
ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ లో పంది అవశేషాలు ఉన్నాయన్న అంశంపై .. యూఏఈ అత్యున్నత ఇస్లామిక్ అథారిటీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఫత్వా కౌన్సిల్ కూడా స్పందించింది. కరోనా వైరస్ వ్యాక్సిన్లు ఇస్లాం పోర్క్ ఆంక్షల పరిధిలోకి రావని స్పష్టంచేశారు కౌన్సిల్ ప్రతినిధులు. మనిషి ప్రాణాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమైన అవసరమని.. వ్యాక్సిన్లలోని పోర్క్ జిలటిన్‌ను మందుగా పరిగణించాలని పిలుపునిచ్చారు. దానిని ఆహారంగా చూడకూడదని స్పష్టం చేశారు. యావత్ మానవాళికి తీవ్ర నష్టం కలిగించే వైరస్ అంతం కోసం.. ఈ వ్యాక్సిన్లు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ప్రకటించారు. అంతర్జాతీయ ముస్లిం ప్రతినిధుల ప్రకటనతో... కరోనా వ్యాక్సిన్‌లలో పంది అవశేషాల వినియోగంపై వివాదం సద్దుమణిగిందనే చెప్పొచ్చు.