కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఆందోళన !
కొన్ని రోజులుగా ఇంగ్లండ్ నుంచి ఇండియాకు వచ్చిన వారిలో 21 మందికి కరోనా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో ఢిల్లీలో 11 మంది, అమృత్‌సర్‌లో 8 మంది, కోల్‌కతాలో ఇద్దరు, చెన్నైలో ఒకరు పాజిటివ్‌గా తేలారు. బ్రిటన్ నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. వీరంతా తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొందరి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 50 మంది ప్రయాణీకులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపించారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించే బాధ్యతలను జెనెస్ట్రింగ్స్ డయగ్నోస్టిక్స్ పర్యవేక్షిస్తోంది. ప్రతి ఒక్కరినీ నిశితంగా పరీక్షించిన తర్వాతే విమానాశ్రయం వెలుపలకు అనుమతిస్తున్నారు. దీంతో ప్రయాణికులు గంటల కొద్దీ అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. రాష్ట్రాల్లోనూ యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాల సేకరిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ భారత్‌లోకి ప్రవేశించలేదని అధికారులు చెబుతున్నా.. కొన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కర్ణాటకతో పాటు ముంబై నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. బార్లు, పబ్‌లు రాత్రి 11 గంటల తరువాత మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
రాత్రి పూట కర్ఫ్యూ విషయంరో కర్నాటక ప్రభుత్వం సడన్‌గా యూ టర్న్ తీసుకుంది. రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయడం లేదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు దెబ్బ తింటాయనే కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ఫ్యూ అమలు చేయడానికి కొన్ని గంటల ముందు.. అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన అధికారులు, ప్రజల్ని అయోమయంలో పడేసింది.