రాముడిని ముంచే కుట్ర జరుగుతోందా...?

Chakravarthi Kalyan
పోలవరం ముంపు మండలాలు.. సీమాంధ్రపరమయ్యాయి. భద్రాచలం పట్టణం మినహా.. రెవెన్యూ డివిజన్ అంతా ఆంధ్రప్రదేశ్ లో కలసిపోయింది. ఇక రాష్ట్రపతి రాజముద్ర ప్రకటన రావడమే తరువాయి. భద్రాద్రి రాముడికి ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. ఆలయం ఒక్కటే తెలంగాణలో ఉండిపోయింది. ఆయన ఆస్తులు చాలావరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండిపోయాయి. భద్రాచలం... రామాలయం కట్టక ముందు నుంచీ తెలంగాణను ఏలిన నిజాం రాజుల పాలనలోనే ఉంది. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని నిజాం నవాబు ఆంగ్లేయులకు అప్పగించినా భద్రాచలం దేవస్థానాన్ని మాత్రం తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. ముస్లిం రాజైనా.. పరమత సహనం పాటించిన నిజాం నవాబులు ఏటా రాముల వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేవారు. ఆ ఆనవాయితీ కొనసాగింపుగానే ప్రస్తుతం రాష్ట్రముఖ్యమంత్రి కళ్యాణ రాముని పట్టువస్త్రాలు,తలంబ్రాలు ఏటా సమర్పిస్తున్నారు. 1874 ప్రాంతంలో నిజాంనవాబు భద్రాచలం దేవస్థానం ప్రాంతాన్ని కూడా ఆంగ్లేయులకు అప్పగించాడు. అప్పుడే ఈ ప్రాంతం గోదావరి జిల్లాల్లో అంతర్భాగమైంది. స్వతంత్యం వచ్చాక కూడా భద్రాచలం గోదావరి జిల్లాలోనే భాగంగా ఉండేది. భద్రాచలం రాముడికి ముంచే కుట్రలో భాగంగానే పోలవరం బిల్లు రూపొందిందని మండిపడుతున్నారు తెలంగాణకు చెందిన బ్రాహ్మణులు. పోలవరం నిర్మాణం పూర్తయితే ముంపు మండలాలే కాకుండా.. భద్రాచలం పట్టణం కూడా మునిగిపోవడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తెలంగాణ సంఘాలు సెక్రటేరియట్ ను ముట్టడించాయి. కేంద్రం దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన తెలిపాయి. పోలవరం బిల్లు ఉభయసభల ఆమోదం పొందినా... ఇంకా ముంపు ప్రాంతాల్లో ఆందోళనలు మాత్రం తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: