అమాయకుల పాలిట యమపాశాలు !
కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయి, ఉద్యోగాలు లేక తీవ్ర మనోవేదనతో పాటు చేతిలో చిల్లిగవ్వ లేక అగచాట్లు పడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. పోషణ బరువుగా మారడం, రోజు గడవడానికే నానా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు కోకొల్లలు.. రోజూ వారి కూలీల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు అనేక మంది ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. దీంతో అప్పులు ఇచ్చే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.. వడ్డీలతో సంబంధం లేకుండా ప్రస్తుతం పూట గడిస్తే చాలు అంటూ అప్పుల పాలవుతున్నారు. రానున్న రోజుల్లో ఏదో ఒక ఉద్యోగమో ఉపాధో దొరక్కపోతదా.. అన్న ఆశతో అప్పులు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న వారినే టార్గెట్గా చేసుకుంటూ కొంత మంది వారిని నట్టేట ముంచుతున్నారు.. మరి కొంత మంది వారి అవకాశాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. వీరితోపాటు..ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టెంట్ క్రెడిట్ యాప్లు ఇలాంటి వారిని ఆకర్షించి వారిని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి.. లోన్ కార్డ్, మనీట్యాప్, రూపే లోన్, క్రెడ్జీ ఇలా సుమారు ఇరువైకి పైగా ఇన్స్టెంట్ క్రెడిట్ యాప్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ఆన్ లైన్ క్రెడిట్ యాప్స్ లో లోన్ తీసుకున్న వారికి ముచ్చెమటలు పట్టించడమే కాదు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.. రోజు రోజుకు వీరి ఆగడాలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.. క్రెడిట్ యాప్ల బారిన పడ్డ అమాయకులు తిరిగి అప్పులు చెల్లించలేక, అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.