బాబుకు కొడాలినే కరెక్ట్...కానీ కుప్పంలో దెబ్బపడుతుందా?
అయితే చాలాసార్లు కొడాలి నాని మాట్లాడే విధానంపై చర్చలు జరిగాయి. కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు చేసే విమర్శలు చూస్తే, కొడాలి నాని కౌంటర్లలో ఎలాంటి తప్పులేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొంచెం ఘాటుగా మాట్లాడకపోతే టీడీపీ నేతలు మరింత రెచ్చిపోతారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. తాజాగా అమరావతి ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు, జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు లేని విధంగా కాస్త మాస్ బాషలో మాట్లాడారు.
ఇక ఇలా మాట్లాడక మంత్రి కొడాలి నాని తగ్గుతారు. ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుకు గట్టిగా కౌంటర్లు ఇచ్చేశారు. కాస్త పరుష పదజాలం వాడుతూనే బాబుపై విరుచుకుపడ్డారు. అయితే ఇలా బాబు విమర్శలకు నాని కౌంటర్లు ఇవ్వడంలో ఏ మాత్రం ఇబ్బంది లేదు. కానీ మొన్న ఎన్నికల్లో బాబు తనయుడు నారా లోకేష్‌ని మంగళగిరిలో ఓడించామని, ఈ సారి చంద్రబాబును కుప్పంలో ఓడించి రాజకీయ సమాధి కడతామన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు చుక్కలు చూపించడం గ్యారెంటీ అని చెప్పారు. 74ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌కు ఏం జరిగిందో.. చంద్రబాబుకూ అదే అదే జరుగుతుందన్నారు.
అయితే నాని చెప్పినట్లు కుప్పంలో బాబుని ఓడించడం అంత సులువా అంటే చాలా కష్టమని చెప్పొచ్చు. ఇప్పటికీ వరుసగా 7 సార్లు కుప్పం నుంచి గెలిచిన బాబుకు ఎవరు చెక్ పెట్టలేకపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలి ఉన్నా సరే బాబు మంచి మెజారిటీతోనే గెలిచారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో కొడాలి చెప్పినట్లు బాబుకు కుప్పంలో చెక్ పడుతుందో లేదో చూడాలి.