ఫోన్ కాల్ లిస్టు:అటు సీబీఐ జేడీ ఫిర్యాదు- ఇటు విజయమ్మ ఫిర్యాదు

 హైదరాబాద్: రాష్ర్టంలో మొత్తం ఫిర్యాదుల పర్వం నడుస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా సంచలన రేపిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ- చంద్రబాల ఫోన్ కాల్ లిస్టులపై ఇప్పటికే చంద్రబాల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా....కొద్ది సేపటి క్రితం సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఫోన్ కాల్ లిస్టుల లీక్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా బయటకు వచ్చిన ఫోన్ లిస్టు గురించి జేడీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని సీటీ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. జేడీ ఫిర్యాదు మేరకు సీటీ పోలీస్ కమిషనర్ ఈ కేసును సీసీఎస్ విభాగానికి బదిలీ చేసినట్లు వార్తలొస్తున్నాయి.  తన ప్రమేయం లేకుండా తన ఫోన్ కాల్ లిస్టును బయటపెట్టిన విషయమై సమగ్రమైన విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ జేడీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జగన్ భద్రత విషయమై సీబీఐ కావాలనే నిర్లక్ష్యం వహిస్తుందంటూ వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాసిన లేఖను ఆ పార్టీ ఎమ్మెల్యే సుచరిత, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మలు డీజీపీకి అందచేశారు. జగన్ భద్రత విషయంలో తమకు అనుమానాలున్నాయంటూ విజయమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  జేడీ లక్ష్మీనారాయణ మీడియాలో ఒక వర్గానికి వార్తలను అందిస్తున్నారనీ, చంద్రబాల, సీబీఐ జేడీ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ ఫోన్ లిస్టులపై విచారణ జరిపించాలనీ డీజీపీకి అందజేసిన ఫిర్యాదులో పొందపర్చారు. మొత్తానికి ఈ రోజంతా చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఫిర్యాదులు చేసుకునే పనితో సరిపోయారు.  ఈ  ఫోన్ కాల్ లిస్టు కేసు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: