రోహిత్ ఆ పరీక్షలో నెగ్గుతాడా..?

NAGARJUNA NAKKA
ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా టెస్ట్ ‌సిరీస్‌కు రెడీ అవుతోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ.. ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు రెడీ అవుతున్నాడు. ఈ రోజు జరిగే టెస్ట్‌లో రోహిత్ నెగ్గుతాడా? ఇప్పటికే రెండు టెస్ట్‌లకు దూరమైన రోహిత్‌ ఆ తర్వాతైనా అందుబాటులో ఉంటాడా? ఈ రోజు ఏం జరగబోతుందనే ఉత్కంఠ క్రీడాభిమానుల్లో నెలకొంది.

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ.. వన్డే, టీ20 సిరీస్ లకు దూరమయ్యాడు. టెస్ట్ ఫార్మాట్‌కైనా పూర్తిగా అందుబాటులో ఉంటాడనుకుంటే అదీ లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమయ్యాడు. దాంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇవాళ రోహిత్‌ శర్మకు రెండో ఫిట్‌నెస్ ‌పరీక్ష జరగుతోంది. దీంతో అందరి చూపూ రోహిత్‌ పైనే ఉంది.

ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడే రోహిత్‌ తొడ కండరాల గాయంతో కొన్ని మ్యాచులు ఆడలేదు. ఇబ్బందేమీ లేకపోవడంతో ఆ తర్వాత నాకౌట్ ‌మ్యాచులన్నీ ఆడాడు. ఐపీఎల్ తర్వాత రోహిత్‌ శర్మను పరీక్షించిన బీసీసీఐ వైద్యబృందం కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచించడంతో అసీస్‌ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీసులకు ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్‌ సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీసీసీఐ నిర్ణయంపై వివాదం చెలరేగింది.

టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ రోహిత్‌ టీమ్‌ఇండియాతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. తన తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో భారత్‌ లోనే ఉన్నాడు. ఎన్‌సీఏలో సాధన చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం పెట్టిన ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమవ్వడంతో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. ఇవాళ అతడు రెండోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఇందులో సక్సెస్‌ అయితే శనివారం రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరుతాడు. అక్కడ 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాక జట్టుతో కలుస్తాడు. టెస్టు మోడ్‌లోకి రావాలంటే అతడు విపరీతంగా నెట్‌ ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఆపై సిడ్నీలో జనవరి 7న మొదలయ్యే మూడో టెస్టు ఆడతాడు. ఒకవేళ విఫలమైతే టీమ్‌ఇండియాకు కోహ్లీతో పాటు రోహిత్‌ కూడా అందుబాటులో ఉండడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: