బీజేపీ, జనసేన మధ్య కుదరని సయోధ్య..
బీజేపీ, జనసేన మీటింగ్ ప్రధాన అజెండా తిరుపతి ఉప ఎన్నికలే అయినా.. రాష్ట్ర సమస్యలపై చర్చించామని చెబుతున్నారు నేతలు. వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలే విఫలమైందని బీజేపీ, జనసేన నాయకులు విమర్శించారు. రైతులు కోరుతున్న పరిహారం అందించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోందని వారు అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతుల వేదన బయటపడిందని వారు పేర్కొన్నారు. రైతుల్లో ఉన్న నిరాశను పోగొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆ పార్టీల నాయకులు అన్నారు.
రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, నిర్మాణాన్ని వైసీపీ పూర్తిగా విస్మరించిందని అంటున్న నేతలు.. రహదారుల దుస్థితిపై బీజేపీ చేపట్టిన ఆందోళనపైనా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల వల్ల సామాన్యుల రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని..అత్యవసర వైద్య సేవల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. ఏలూరు నగరంలో అంతుబట్టని అనారోగ్య సమస్యలతో ప్రజలు పడుతున్న ఆందోళనపై విచారం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర బృందాలను ఏలూరుకు పంపి పరిస్థితిని అధ్యయనం చేసి, విచారణ చేయించాలని ప్రధాని మోదీని కోరాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తింపజేయాల్సిన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, రాష్ట్రంలో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రెండు పార్టీలూ నిర్ణయించాయి. పథకాల అమలు, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీంతో ప్రధానంగా రాయలసీమలో యువత ఇబ్బంది పడుతున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు.