ఏపీలో శాశ్వత భూ హక్కు- భూ రక్షా పథకం !

NAGARJUNA NAKKA
వైయస్ ఆర్  జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్షా పథకం పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనుండటంతో క్షేత్ర స్థాయి సమస్యలు, విధి విధానాల పై అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి.

ఈ నెల 21 నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమగ్ర భూ సర్వే పథకాన్ని ప్రారంభించనుంది. వైయస్ ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పేరిట మొదలుకానున్న పథకంపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. పథకంలో భాగంగా.. అటవీ ప్రాంతాలు మినహా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో 1 లక్షా 26 వేల  చదరపు కిలో మీటర్ల భూమిని సర్వే చేస్తారు. మొత్తం  17వేల 460 గ్రామాల్లో సర్వే జరుగుతుంది. మొదటి విడతలో భాగంగా  5 వేలు, రెండో విడతలో 6వేల 500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే జరుగుతుంది.

పట్టణాలు, నగరాల పరిధిలో 3వేల 346 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే  జరుగుతుంది. ఇక ఓపెన్‌ ల్యాండ్స్‌కు సంబంధించి.. 10 లక్షల ఓపెన్‌ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్‌ భూముల్లో సర్వే  జరుగుతుంది. 2 కోట్ల 26 లక్షల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూముల్లోనూ సర్వే జరుగుతుంది.

సర్వే పూర్తైన తర్వాత  ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డు ఇస్తారు. ఈ కార్డులో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ కేటాయిస్తారు. ప్రాపర్టీ కొలతలు, మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. దీనికి క్యూ ఆర్‌ కోడ్‌ కూడా జత చేస్తారు. సర్వే పూర్తైన తర్వాత డిజిటైజ్డ్‌ కాడస్ట్రల్‌ మ్యాప్‌లు తయారు చేస్తారు. ప్రతి గ్రామంలోని కమతం, భూమి వివరాలు ఈ మ్యాప్‌లో పొందు పరుస్తారు. భూ కొలతల ప్రక్రియ పూర్తైన తర్వాత సర్వే రాళ్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అంతే కాదు ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్‌ రిజిస్టర్‌, వివాదాల నమోదు కోసం ప్రత్యేకంగా మరో రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ భూ సర్వే ప్రక్రియ కోసం రాష్ట్రంలోని రెవెన్యూ సిబ్బదికి సర్వే ఆఫ్‌ ఇండియా శిక్షణ ఇస్తోంది. ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది.

మండలానికి ఒక డ్రోన్‌ బృందం, డేటా ప్రాససింగ్‌ టీం, రీ సర్వే టీం అందుబాటులో ఉంటుంది. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్‌ చేయలేని రీతిలో భద్రపరచాలని సీఎమ్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ ఫీచర్స్‌ పటిష్టంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సర్వే శిక్షణ కోసం తిరుపతిలో కొత్తగా ఒక కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు  చేయాలన్న సీఎం .. సమగ్ర సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి కావాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: