గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు

Deekshitha Reddy
గ్రేటర్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వేళ.. అభ్యర్థులు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఖర్చుకి వెనకాడకుండా ఇతర జిల్లాల నాయకుల్ని తీసుకొచ్చి ఓటర్లను చేజారకుండా చేస్తున్నారు. బూత్‌ స్థాయిలో ప్రతి ఓటునీ చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా అన్ని పార్టీలు వివిధ జిల్లాల నుంచి తమ కేడర్ ‌ను తీసుకొచ్చాయి. అందర్నీ తీసుకొచ్చి నగరంలో మోహరించాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ ఛార్జులు హైదరాబాద్ కి తరలి వచ్చారు. క్షేత్రస్థాయిలో ఓట్లు చేజారకుండా వీరు పని మొదలు పెట్టారు. ఏ డివిజన్‌ పరిధిలో చూసినా, ఏ గల్లీలో చూసినా ఇతర జిల్లాల నాయకులు, కార్యకర్తలు భారీగా కనిపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 90-100 బూత్‌ల బాధ్యతలు అప్పగించాయి పార్టీలు.  

ఇప్పటి వరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తు. ఇప్పుడు జరగబోతున్న నగదు పంపిణీ మరో ఎత్తు. ప్రచారంలో దూసుకుపోయినా.. చివరకు నగదు పంపిణీలో వెనకపడితే మాత్రం ఓట్లు పడటం కుదరని పని. అందుకే బస్తీల్లో నగదు పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. ఇతర జిల్లాలనుంచి తీసుకొచ్చిన నేతలతో ఈ పని పూర్తి చేస్తున్నాయి.

నగదు పంపిణీ జరిగినా కూడా.. ఓటరును పోలింగ్‌ బూత్‌ వరకు రప్పించి, తమకే ఓటు పడేలా చేసుకోవడం మరో పెద్ద కార్యం. దీనికోసమే పది బూత్‌లకు ఒక నాయకుడిని నియమించాయి పార్టీలు. వీరందరిపై పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించాయి. అనుమానం ఉన్న డివిజన్ల బాధ్యతలను ఆ పార్టీ కొందరు క్రియాశీలక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులకు అప్పగించింది. మొత్తమ్మీద ఇతర జిల్లాలనుంచి తీసుకొచ్చిన నేతలతో జోరుగా గ్రేటర్ లో పంపకాలు సాగుతున్నాయి.

గతంలో స్వల్ప ఓట్ల తేడాతో విజయాన్ని కోల్పోయిన వారంతా ఈ దఫా ఎలాగైనా గ్రేటర్ లో పాగా వేయాలని చూస్తున్నారు. ఖర్చుకి వెనకాడకుండా రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రచారానికి విపరీతంగా ఖర్చు చేసిన అభ్యర్థులు.. ఎన్నికల ముందు రోజు, పోలింగ్ రోజు మరింత భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: