రామమందిర నిర్మాణంలో ఆసక్తికర విషయం..!

NAGARJUNA NAKKA
అయోధ్య రామమందిర నిర్మాణానికి కాకతీయ సాంకేతిక పరిజ్జానం వాడబోతున్నారు. శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీతో వెయ్యి ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడంతో దీనిపై దృష్టి పెట్టింది రామాలయ ట్రస్ట్‌. కాకతీయ హెరిటేజ్‌ టీమ్‌తో చర్చిస్తోంది. కాకతీయుల పురాతన సాంకేతిక పరిజ్జానానికి అపురూప గౌరవం దక్కనుంది. చారిత్రాత్మక అయోధ్య రామాలయ నిర్మాణంలో వరంగల్ వెయ్యి స్థంభాలు, రామప్ప గుడి నిర్మాణ శైలిని ఉపయోగించనున్నారు.

కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు, కళాఖండాలు ఇప్పటికీ చెక్కుచెదరని జ్ఞాపకంగా ఉన్నాయి. వారు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు మొదలు... దేవాలయ నిర్మాణాల్లో అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రతిభ కనిపిస్తుంది. ఇటు ఎంతో పేరు పొందిన వెయ్యి స్తంభాల గుడి... రామప్ప ఆలయ నిర్మాణంలో కంకర, సున్నం లేకుండా  కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని నిర్మించిన దేవాలయాలు వెయ్యి ఏళ్లు దాటినా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవి భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఉన్నాయి.

ఎలాంటి సాంకేతికత అందుబాటులోలేని కాలంలో కాకతీయులు ఉపయోగించిన పద్ధతినే ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణంలో ఉపయోగించాలని ట్రస్ట్‌ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేసిన కాకతీయ బోర్డు సభ్యులను పిలిచి చర్చించారు.

గత నెల 19, 20, 21 తేదీల్లో ఇక్కడి నుంచి టీమ్‌ అయోధ్య వెళ్లి పరిశీలించింది. అప్పట్లో అయోధ్యను ఆనుకుని ఉన్న సరయూనది పూర్వపు ప్రవాహ పాయలను సైతం రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలు మరింత పటిష్టంగా ఉండేలా చూడాలని సూచించారు. సిమెంట్ కాంక్రీట్‌కు బదులు కాకతీయులు వాడిన సాండ్ బాక్స్ టెక్నాలజీ వాడితే పటిష్టంగా ఉంటుందన్నది మన టీమ్‌ మాట. దీనిపై అయోధ్య ట్రస్ట్‌ సభ్యులు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మనదేశంలోని భక్తుల దృష్టి అంతా ఆధ్యాత్మిక నగకరం అయోధ్యనపైనే ఉంది. ఆ ఆలయ నిర్మాణం ఎలా జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: