ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకునే వార్త..!
మార్చి నెలాఖరులో కరోనా ఏపీలో మొదలయింది. నెల్లూరు నగరంలో మొదటి కరోనా కేసు నమోదు అయింది. ఆ తర్వాత ఒక్కో జిల్లాలో పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు మొత్తంగా 8,54,764 కేసులు నమోదు కాగా.. 6881 మంది మృత్యవాత పడ్డారు. ఇక మార్చి నుంచి ఇప్పటివరకు చూస్తే, ఆగస్టు నెలలో కరోనా పీక్ స్టేజ్ కు చేరింది.
మార్చిలో 44 కరోనా కేసులు నమోదు కాగా.. ఆ నెలలో మరణాలేవీ నమోదు కాలేదు. ఇక ఏప్రిల్ నెల నుంచి కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గుదల అనేదే లేదు. ఏప్రిల్ నెలలో 1,359 కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత మేలో 2,168 కేసులు 31 మరణాలు, జూన్ లో 11,024 కేసులు 125 మరణాలు, జూలైలో 1,26,338 కేసులు 1,162 మరణాలు నమోదయ్యాయి.
ఆగస్టు నెలలో కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆగస్టులో ఏకంగా 2,93,838 కేసులు 2620 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతూ వచ్చింది. సెప్టెంబర్ నెలలో కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. సెప్టెంబర్ నెలలో 2,58,713 కేసులు1,859 మరణాలు నమోదయ్యాయి. ఇక అక్టోబర్ నెలలో 1,29,864 కేసులు నమోదైతే.. 862 మరణాలు కనిపించాయి. నవంబర్ నెలలో ఇప్పటి వరకు 31,416 కరోనా కేసులు నమోదు కాగా.. మరణాలు 191 మరణాలు సంభవించాయి. ఈ గణాంకాలను పరిశీలిలిస్తే, కరోనా కేసులు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చినట్టేనని భావించాలి.
అయితే కరోనా కేసులు ప్రస్తుతం తగ్గినట్టు కనిపిస్తున్నా, ఈ లెక్కలను చూసి రిలాక్స్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. సోమవారం 43,044 శాంపిల్స్ మాత్రమే పరీక్షించారు. గతంలో ప్రతిరోజు 90 వేల వరకు టెస్టులు చేసేవారు. దీపావళి, ఆదివారం కావడంతో శాంపిల్స్ తగ్గాయంటున్నారు. దీనివల్లే సోమవారం కేసులు తక్కువగా రికార్డయ్యాయనే వాదనలు కూడా ఉన్నాయి.
ఏ లెక్కన చూసినా ఏపీలో ఏపీలో ప్రస్తుతం కరోనా ఉధృతి అంతగా లేదనే మాట వాస్తవం. కానీ, జాతీయ, అంతర్జాతీయ గణాంకాలు మాత్రం ఆందోళణకరంగానే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా.. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ భీకరంగా మారింది. చాలా చోట్ల లాక్ డౌన్ విధించారు.