సినిమాలు తీస్తున్న సెక్స్ వర్కర్ల పిల్లలు...

Chakravarthi Kalyan
సెక్స్ వర్కర్లు.. సమాజంలో హీనంగా చూడబడుతూ.. జీవితంలో వెలుగులు కరవైన చీకటి బతుకులు వీరివి. అతికొద్ది మంది తప్ప.. ఎవరూ కావాలని సెక్స్ వర్కర్లుగా మారాలను కోరు. ఈ నిశీధి పద్మవ్యూహంలోకి అతివలను లాక్కొచ్చే కారణాలు ఎన్నో.. పేదరికం కారణంగా పొట్ట నింపుకోవడానికి ఈ ఊబిలో దిగేవారు కొందరైతే.. జీవితంలో మోసానికి గురై.. వేరే దారి లేక.. ఇందులో చిక్కుకుపోయేవారు మరికొందరు. ఏ కారణాలతో ఈ దందాలో అడుగుపెట్టినా.. ఒక్కసారి ఈ రొంపిలో దిగాక.. ఇక సాధారణ జీవితం గడపే అవకాశం ఏ కొంత మందికో కానీ రాదు. సెక్స్ వర్కర్ల జీవితాలంటే అందరికీ ఆసక్తే.. ఈ అంశం సినిమాలకు, నవలలకు, చివరకు వార్తలకూ ఎప్పుడూ ఆసక్తికరమైన ముడిసరకే. అందుకే వేశ్యలు, వ్యాంప్ నటీమణుల జీవితాలపై ఎన్నో సినిమాలు వచ్చి.. వసూళ్ల వర్షం కురిపించాయి. ఐతే.. వీటిలో కాసులు కురిపించే కోణాలనే దర్శకులు, రచయితలు వాడుకోవడం పరిపాటిగా మారింది. సెక్స్ వర్కర్ల జీవితాలను ఎంత సెక్సీగా చూపిస్తే.. జనం ఎగబడతారు.. అనే కాసుల కోణమే తప్ప.. ఇతర మానవీయ కోణాలు ఏ కొందరో తప్ప స్పృశించరు. ఆ విషయంలో సినీ దర్శకులనూ పూర్తిగా తప్పుబట్టలేం. సందేశాత్మక సినిమాలను ఆదరించే రోజులు కావివి. సందేశాలిచ్చి చేతులు కాల్చుకునేంత అమాయక నిర్మాతలూ లేరు. మరి.. సెక్స్ వర్కర్ల జీవితాల్లోని ఇతర కోణాలను ఎవరు చూపిస్తారు.. వారి దుర్భర జీవితాలను ఎవరు వెలుగులోకి తెస్తారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు లభించబోతోంది. ఈ బాధ్యతను ఇప్పుడు వారి పిల్లలే భుజాలకెత్తుకుంటున్నారు. ఔను.. నిజం.. కోల్ కతాలోని రెడ్ లైట్ ఏరియాల్లోని పిల్లలు ఇప్పుడు తమ తల్లుల జీవితాలపై చిత్రాలు తీయబోతున్నారు. ప్రముఖ దర్శకులు ఆసిం ఆషా.. వీరికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో సినీ నిర్మాణంపై జరిగిన వర్క్ షాప్ కు దాదాపు 50 మంది సెక్స్ వర్కర్ల పిల్లలు హాజరయ్యారు. ఓ స్వచ్చంధ సంస్థ, ఫ్రెంచ్ కల్చరల్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఇకపై సెక్స్ వర్లర్ల జీవితాలే కాదు.. వారి పిల్లలు.. వారి జీవనయానంలోకి మరిన్ని కోణాలు ఇకపై తెరపై ఆవిష్కృతమవుతాయన్నమాట...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: