కొత్త చీఫ్ సెక్రటరీ రాబోతున్నారా..?

NAGARJUNA NAKKA
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారబోతున్నారు. సీఎస్‌గా నీలం సాహ్నీ పదవీకాలం ముగియనుండటంతో.. ఆ స్థానంలో మరొకర్ని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లోనే నీలం సాహ్నీ రిటైర్‌ కావాల్సి ఉన్నా.. డిసెంబర్‌ వరకు కొనసాగే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అయితే సాహ్నీ సేవలను ఇంకా వినియోగించుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోన్నా.. కేంద్రం ఎంత వరకు సుముఖంగా ఉంటుందనేది అనుమానంగా ఉంది. దీంతో కొత్త సీఎస్‌ విషయంలో తర్జనభర్జన పడ్డ సర్కార్‌.. దాదాపు ఓ అభిప్రాయానికి వచ్చిందనే చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ఏపీ కేడర్‌లో సీనియర్‌ ఐఏఎస్‌ల జాబితా ప్రకారం.. నీలం సాహ్నీ భర్త సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రమణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఏస్వీ ప్రసాద్‌, నీరబ్ కుమార్ ప్రసాద్, ఆదిత్యనాధ్ దాస్, గిరిధర్, పూనం మాల కొండయ్య, కరికాల వలవన్‌లు లిస్టులో ఉన్నారు. వీరిలో.. రెడ్డి సుబ్రమణ్యం, అభయ్ త్రిపాఠి, గిరిధర్‌ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వీరి గురించి ప్రభుత్వం కూడా పెద్దగా ఆలోచన చేస్తున్నట్టు కన్పించడం లేదు. దీంతో మిగిలిన వారిలో ఎవరికి అవకాశం వస్తుందనే దానిపైనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతపరిణామాలు.. ప్రభుత్వ ఆలోచనలు చూస్తుంటే జేఏస్వీ ప్రసాద్‌, నీరబ్ కుమార్ ప్రసాద్‌లపై ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. ఒకానొక దశలో రెడ్డి సుబ్రమణ్యం పేరు బలంగా వినిపించినా.. ఆ తర్వాత ఎందుకో ఆ పేరు మళ్లీ తెర మరుగైంది.

కేంద్ర సర్వీసుల్లో ఉంటూ, ఏడాదిలో రిటైర్ కాబోతున్న సమీర్‌ శర్మ.. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. మరో ఐఏఎస్‌ కరికాల వలవన్ రిటైర్మెంట్‌కు ఎక్కువ సమయమే ఉండటంతో.. ప్రభుత్వం ఈ పేరును అంతగా పరిశీలించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇక పూనం మాలకొండయ్యను సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందా..? అనే చర్చ కూడా జోరందుకుంది.  దీంతో, ఆదిత్యనాధ్ దాస్, సతీష్ చంద్ర పేర్లపైనే ప్రస్తుతం సీరియస్‌గా చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: