దీపావళి వేళ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన..!
కోవిడ్ కారణంగా చాలా మంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు కల్పించింది. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద కొత్త ఉద్యోగుల కల్పన సృష్టించనుంది. ఉద్యోగుల్ని తీసుకునే సంస్థలకు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో రెండేళ్ల పాటు సబ్సిడీ కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అక్టోబరు 1 నుంచి ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. 1000 లోపు ఉద్యోగులుండే సంస్థలకు ఉద్యోగుల వాటా, సంస్థల వాటా పీఎఫ్ మొత్తం 24శాతం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 1000 కంటే ఎక్కువ ఉండే సంస్థలకు మాత్రం పీఎఫ్ వాటాను కేంద్రం ఇస్తుందని తెలిపారు.
దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా 1.46 కోట్ల రూపాయలతో ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొబైల్ తయారీ, వైద్య పరికరాల తయారీ రంగాలకు 51 వేల 355కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కిందకు మరో 10 రంగాలకు తీసుకొస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయానికి మద్దతు కల్పించే దిశగా ఎరువుల రాయితీకి అదనంగా 65 వేల కోట్ల రూపాయలు ఇవ్వనుంది కేంద్రం. దీంతో కోటీ 40 లక్షల మందికి లబ్ధి కలగనుంది.
కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల కోసం ఆర్ అండ్ డీ విభాగానికి 900 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఈ నిధులు హెల్త్ డిపార్టెమెంట్‌కు కాదని తెలిపారు. ఈ నిధులు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. అదే విధంగా రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు ఆదాయపు పన్నులో ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం.