చిరాగ్ పాశ్వాన్ తర్వాతి టార్గెట్ అదే..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు సాధించిన పార్టీ లోక్ జనశక్తి పార్టీ. గెలిచింది ఒక్క సీటే అయినా.. ఓడించిన సీట్లు చాలా ఉన్నాయి. జేడీయూ 1000లోపు ఓట్ల తేడాతో ఓడిపోయన చోట్ల ఎల్‌జేపీ ప్రభావం చూపించింది. మిథిలాంచల్, పూర్వాంచల్ ప్రాంతంలో జేడీయూని భారీగా దెబ్బ కొట్టారు చిరాక్ పాశ్వాన్. ఒకే కూటమిలో ఉన్న ఒక పార్టీతో స్నేహంగా ఉంటూ.. మరో పార్టీని శత్రువులా చూడటమే కాకుండా.. శత్రువుని వెంటాడి ఆయన నష్టపరిచారు. తమ పార్టీ సీట్లు గెలవలేకపోయినా.. ప్రత్యర్థి దెబ్బ తిన్నాడనే కిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఎల్జేపీ అధినేత.
జేడీయూని దెబ్బ తీసినా.. బీజేపీతో సత్సంబంధాలే ఉన్నాయి చిరాగ్ పాశ్వాన్‌కి. మోడీ శ్రీరాముడైతే తాను హనుమంతుడినని ప్రకటించుకున్నారాయన. ఎన్నికల ప్రచారంలో మోడీని కానీ, బీజేపీనీ కానీ పల్లెత్తు మాటనలేదు. ఆయన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించే వరకూ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో చిరాగ్ పాశ్వాన్‌కు ఏదో ఒక పదవి దక్కినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో ఎల్జేపీ బీజేపీలో కలిసిపోయి చిరాగ్ పాశ్వాన్ బీహార్ బీజేపీని నడిపించే స్థాయికి ఎదిగే అవకాశాల్ని కొట్టే పారేయలేం అంటున్నారు విశ్లేషకులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీకి 5.6 శాతం ఓట్లు వచ్చాయి. 1985లో ఎల్జేపీ 12 శాతం ఓట్లు సాధించింది. గతంతో పోలిస్తే ఆ పార్టీ ఓటు బ్యాంక్ క్షీణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2025లో అధికారంలోకి రావడమే లక్ష్యమని చెబుతున్న చిరాగ్ పాశ్వాన్‌కి.. పార్టీ కోల్పోయిన ఓటు బ్యాంక్‌ను తిరిగి సాధించడంతో పాటు అన్ని వర్గాల ఆదరణ దక్కించుకోవడం కత్తిమీద సాము లాంటిదే. ఈ యువనేత సంయమనంతో వ్యవహరిస్తే బీహార్ ముఖ్యమంత్రి కావాలనుకుని కాలేకపోయిన తండ్రి లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది.