ఇస్రో జైత్రయాత్రలో మరో కలికితురాయి !
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించిన PSLV C-49 రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేసింది. రాకెట్ ప్రయోగ సమయంలో భారీ వర్షం పడడంతో.. పది నిమిషాలు ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉండగా, పది నిమిషాలు ఆలస్యంగా 3 గంటల 12 నిమిషాలకు రాకెట్ ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు.
PSLV C-49 రాకెట్ 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఇందులో భారత్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేటర్ EOS-01తో పాటు మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలున్నాయి. ఇందులో అమెరికా, లక్సెంబర్గ్‌లకు చెందినవి చెరో నాలుగు ఉపగ్రహాలు కాగా, ఒకటి లిథువేనియాకు చెందినది. వాస్తవానికి EOS-01 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ RI-SAT రకానికి చెందిన మూడవ ఉపగ్రహం. గత ఏడాది ప్రయోగించిన RI-SAT-2B, RI-SAT-2BR1లతో కలిసి ఇది పనిచేయనుంది. తొలుత దీనికి RI-SAT-2BR2గా పేరు పెట్టినా.. తర్వాత EOS-01గా మార్చారు. కాగా.. PSLV C-49 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేతలు సంబరాలు చేసుకున్నారు.
PSLV C-49 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు isro చైర్మన్ శివన్. EOS-01తో పాటు తొమ్మిది కస్టమర్ శాటిలైట్లను 575 కిలో మీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. EOS-01 శాటిలైట్ పనిచేయడం ప్రారంభించిందని వివరించారు. శాటిలైట్‌కు అమర్చిన సోలార్ ప్యానెళ్లు విచ్చుకున్నాయని తెలిపారు శివన్.
తాజా ప్రయోగం కోసం సరికొత్త శ్రేణికి చెందిన PSLV రాకెట్‌ను ఉపయోగించింది ఇస్రో. ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యల్లోకి ప్రవేశపెట్టిన PSLV లాంచ్ వెహికల్ వృధా కాదు. అది కూడా నిరిష్ట కక్ష్యలో ప్రవేశించి ఓ శాటిలైట్‌లా దాదాపు ఆరు నెలల పాటు ఉపయోగపడుతుంది. వాహక నౌకలో అమర్చిన పరికరాలను వివిధ ప్రయోగాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.