మీడియా మంటలు: ఒక్క ట్వీట్‌తో మీడియా మొత్తాన్ని బకరా చేసిన పీవీ సింధు..?
సరిగ్గా ఇదే సమయంలో నిన్న ఆమె పెట్టిన ఓ ట్వీట్ క్షణాల్లో సంచనలంగా మారింది. వైరల్ అయ్యింది. అందులోనూ ఆ ట్వీట్‌లో పెద్ద అక్షరాలతో ఐ రిటైర్ అని పెట్టేయడంతో మీడియా పండగ చేసుకుంది.
డెన్మార్క్ ఓపెన్ తన చివరి పోటీ అని ఐ రిటైర్ అని పెద్ద అక్షరాలతో ట్వీట్ పెట్టేసరికి.. బ్యాడ్మింటన్ క్రీడకు పీవీ సింధు రిటైర్మెంట్ అంటూ టీవీ ఛానళ్లు హోరెత్తించాయి. పాతికేళ్ల అమ్మాయి.. అందులోనూ ఇంకా చాలా కెరీర్ ఉన్న అమ్మాయి అలా ట్వీట్ పెట్టేసరికి మీడియా తెగ హడావిడి చేసింది.
ఇక తెలుగు చానళ్ల సంగతి చెప్పనవసరం లేదు కదా.. ఇదిగో పులి..అంటే అదిగో తోక అనే టైపు కదా.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే కుమ్మేశాయి. అలా దాదాపు అరగంట, గంట సేపు అన్ని చానళ్లు హడావిడి చేసేశాయి. ఆ తర్వాత ఎవరో కాస్త బుర్ర ఉన్న జర్నలిస్టులు ఆ ట్వీట్ మొత్తం చదివినట్టున్నారు.. ఆపేయండ్రా బాబోయ్ అంటూ బ్రేకింగులు ఆపేశారు.
అసలు విషయం ఏంటంటే.. తాను రిటైర్ అవుతానన్నది ఆటల నుంచి కాదు.. కరోనా కారణంగా వచ్చిన అనారోగ్యకర వాతారవణం నుంచి అట.. ఈ నెగిటివిటీ.. ఈ అనిశ్చితి నుంచి తాను బయటపడాలి అనుకుంటున్నానంటూ ట్వీట్‌లో పేర్కొంది. మొత్తం ఒక్కటే ట్వీట్ అయినా.. పెద్ద అక్షరాలతో ఐ రిటైర్ అని పెట్టడంతో మీడియా సహజంగానే బోల్తా పడింది. ఆ తర్వాత నాలిక కరుచుకున్న ఛానళ్లు.. తాము కన్‌ఫ్యూజ్ అయ్యామని చెబితే బాగోదు కాబట్టి.. సింధు ట్వీట్ చూసి ఫ్యాన్స్ అపార్థం చేసుకున్నారంటూ ప్లేటు ఫిరాయించేసి అసలు విషయం మళ్లీ బ్రేకింగులు వేశాయి. మొత్తానికి సింధు ఒక్క ట్వీట్‌తో మీడియాలో సెగలు పుట్టిం చేసింది. సింపుల్ గా చెప్పాలంటే మీడియాను బకరా చేసేసింది.