భాగ్యనగర వాసులను వెంటాడుతున్న వరద కష్టాలు..!

NAGARJUNA NAKKA
వర్షం తగ్గినా..హైదరాబాద్‌ను వరద ఇబ్బంది పెడుతోంది. ఇంకా నగరంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు చుక్కెదురవుతోంది.

హైదరాబాద్‌ను ఇంకా వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోంచి బయటపడలేదు. కొన్ని చోట్ల కనీసం నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవటానికి  కూడా అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల 50 మంది మృతి చెందారు.  ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 11 మంది చనిపోయారు. భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఆర్థికసాయం అందించనుంది.  

ఇక..వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను జనం ఎక్కడిక్కడే నిలదీస్తున్నారు. ఉప్పల్ పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు. ఏకంగా ఎమ్మెల్యేపైనే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మీ పేరు రాసి చనిపోతామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఊహించని ఘటనతో షాక్‌కు గురైన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి బాధితులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.  

హైదరాబాద్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులకు చేదు అనుభవం ఎదురవుతోంది.  ఎక్కడికక్కడ సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిథులను నిలదీస్తున్నారు వరద బాధితులు. అమీన్‌పూర్‌లో పర్యటించిన అధికారులను నిలదీశారు జనం. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చినా..అధికారులు పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారంటూ మండిపడుతున్నారు అమీన్‌పూర్‌వాసులు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. తన పర్యటనకు అధికారులు రావడం లేదని ఫైరయ్యారు కేంద్రమంత్రి. అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. తన పర్యటనకు ఆర్డీవో స్థాయి అధికారి రావాలన్నారు. కనీసం ఎమ్మార్వోలు కూడా హాజరుకావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు కిషన్‌ రెడ్డి. మొత్తానికి హైదరాబాద్ లో వర్షం తగ్గినా.. వరద కష్టాలు మాత్రం భాగ్యనగరాన్ని వెంటాడుతున్నాయి. వరద బాధితులకు అధికారుల పరామర్శలు వెల్లువెత్తాయి. పలు చోట్ల సమస్యలపై అధికారులను నిలదీశారు స్థానికులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: