స్పీకర్ తమ్మినేనిని అరెస్టు చేసేస్తారా..? హైకోర్టు వ్యాఖ్యల అంతరార్థం అదేనా ?
అసెంబ్లీ స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్దమైన పదవి. రాజ్యాంగ బద్దమైన పదవులకు కొంత రక్షణ ఉంటుంది. వారిపై అడ్డగోలుగా కేసులు పెట్టడం అరెస్టు చేయడం వంటివి కుదరదు. అందుకే స్పీకర్ పై చర్యలు అంత సులభం కాదు. అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ రక్షణకూ పరిమితులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అందులోనూ ఏపీ స్పీకర్ కోర్టులపై అసెంబ్లీ వెలుపల కామెంట్ చేశారు. అసెంబ్లీ వెలుపల చేసిన కామెంట్లకు స్పీకరైనా సరే రక్షణ ఉండదని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.
అసలు ఈ విషయంలో కోర్టు ఏమని కామెంట్ చేసిందో చూద్దాం... కోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి ఓ ప్రధాన పత్రిక ఇలా రాసింది.. "శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు హైకోర్టు, న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లుందని ఏపీ హైకోర్టు మండిపడింది. ఆ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో న్యాయవ్యవస్థను మూసేయాలనే ఉద్దేశంతో ఆ తరహా వ్యాఖ్యలు చేసినట్లుందని గట్టిగా చెప్పింది.”
" హైకోర్టు పాత్ర లేకుండా చేసి ప్రతీదీ తామే నిర్ణయించొచ్చు అన్నట్లు వారి తీరుందని తీవ్రంగా ఆక్షేపించింది. ఆ తరహా వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న వ్యక్తి (స్పీకర్) శాసనసభలో కాకుండా వేరేచోట చేస్తే కచ్చితంగా కోర్టుధిక్కరణ అవుతుందని స్పష్టం చేసింది. స్పీకర్ వ్యాఖ్యల వ్యవహారాన్ని ప్రత్యేకంగా పరిగణించి విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.” ఈ వ్యాఖ్యల తీవ్రత చూస్తే.. తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యలపై ప్రత్యేకంగా విచారణ జరిపే అవకాశం లేకపోలేదు.