ఆనాటి గాంధీ గారి కల.. ఈనాడు జగన్ నెరవేర్చారట..!?
గ్రామాల్లో ఉండేవారికి కనీస సౌకర్యాలు కరవవుతున్నాయి. పాలనపరంగా సేవలూ అంతంత మాత్రమే. అయితే ఈ లోటు తీర్చేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో పాలన, సౌకర్యాలు మరింత సులభంగా అందేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలన ప్రజల గుమ్మం ముందుకే వచ్చిందంటున్నారు. దీని ద్వారా ఆనాటి గాంధీ కల నెరవేరుతోందంటున్నారు.
గతంలో పింఛన్, రేషన్ కార్డ్ కావాలంటే ఎండీఓ ఆఫీస్ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేదని... కానీ ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజమే.. పింఛన్, రేషన్ కార్డులు కూడా వెంటనే మంజూరు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు, పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలు నిర్ణయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. అందుకే ఇప్పుడు ఈ మంచి వ్యవస్థను వైసీపీ ప్రమోట్ చేసుకుంటోంది.
అంతేకాదు.. ఈ సచివాలయ వ్యవస్థకు ప్రధాన మంత్రి మోడీ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. దాన్ని కూడా వైసీపీ తన ప్రమోషన్లో ప్రస్తావిస్తోంది. అయితే వైసీపీ ప్రమోషన్ చేసుకున్నంతగా.. గాంధీ గారి కల నెరవేరినంతగా అప్పుడే మార్పు కనిపించకపోయినా.. ఇదొక మంచి ప్రారంభంగా మాత్రం చెప్పుకోవచ్చు. ఈ మార్పును మరింత పట్టుదలగా సాకారం చేసినట్టయితే.. ప్రత్యేకించి జగన్ సర్కారు ఓట్ల కోసం జనం ముందుకు వెళ్లక్కర్లేదు. జనమే మరోసారి గెలిపిస్తారు.