లోపం వ్యవస్ధదే..పోలీసులది కాదు..బయటపడేవరకు అంతే

M N Amaleswara rao
’పోలీసులను డి‌జి‌పి నియంత్రించలేరా ?’..అంత సమర్ధత లేకపోతే రాజీనామా చేయాలి..ఇవి తాజాగా ఏపీ పోలీసు బాసును ఉద్దేశించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ అక్రమ నిర్బంధం కేసులో పోలీసు వ్యవస్ధను ఉద్దేశించి కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  రాజకీయ నాయుకుల గుప్పిట్లో పోలీసు వ్యవస్ధ చిక్కుకున్నంత వరకు సమస్య ఇలాగే ఉంటుంది. న్యాయవ్యవస్ధ ఎన్నిసార్లు, ఎన్ని హెచ్చరికలు చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే పోలీసులను తమిష్టానుసారం వాడుకుంటున్నఅధికార రాజకీయ పార్టీ ప్రత్యర్ధులపైకి పోలీసులను ఉసిగొల్పటమన్నది చాలా సహజమైపోయింది.
నిజానికి పోలీసులు తమ పరిధిని దాటి వ్యవహరించటం అన్నది తప్పే. ఇదే సమయంలో అధికార పార్టీ నేతల కొమ్ము కాయటం కూడా తప్పే అనటంలో సందేహం లేదు. కానీ దశాబ్దాల పాటు పోలీసులు ఇలాగే చేస్తున్నారు. పోలీసులు ఇలా వ్యవహరించటం వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలుకాలేదు. మొన్నటి టిడిపి హయాంలో కూడా ఇలాగే వ్యవహరించారన్న విషయం అందరూ చూసిందే. కాకపోతే ఇప్పుడు మాత్రమే కోర్టులు పోలీసు బాసులను పిలిపించటం, కఠినంగా హెచ్చరించటం చూస్తున్నాం.
టిడిపి హయాంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ హయాంలో మహిళల సాధికారత మీద ఓ సదస్సు జరిగింది. దానికి మహిళా ప్రముఖులను పిలిచినట్లే వైసిపి ఎమ్మెల్యే రోజాను కూడా ఆహ్వానించారు. సదస్సులో పాల్గొనేందుకు రోజా గన్నవరం విమానాశ్రయానికి రాగానే పోలీసులు ఆమెను అడ్డుకుని తమ వాహనంలో ఎక్కించుకున్నారు. తర్వాత సుమారు 10 గంటల పాటు ఆమెను పోలీసులు ఎక్కడెక్కడ తిప్పారో ఎవరికీ తెలీదు. ఉదయం రోజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రికి హైదరాబాద్ లో దింపేశారు. ఇది రూల్ ఆఫ్ లా ను బ్రేక్ చేయటం కాదా ? ఈ విషమయై అప్పట్లో తనను నిర్బంధించిన పోలీసులపై రోజా కేసు పెట్టినా చర్యలు లేవు.
గుంటూరులో టిడిపి హయాంలోనే ముస్లిం మైనారిటిల కోసం ’నారా హమారా’ అనే బహిరంగసభ జరిగింది. ఆ సభలో ముస్లింల కోసం చంద్రబాబు చాలా హామీలను గుప్పించారు. 2014లో తమకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు  చేయటం లేదంటూ నంద్యాలకు చెందిన కొందరు ముస్లిం యువకులు ప్లకార్డులు పట్టుకుని కేకలు వేశారు. దాంతో పోలీసులు వచ్చి వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోయారు. మామూలుగా అయితే ఏం చేస్తారంటే గోల చేస్తున్న యువకులను బయటకు  తీసుకెళ్ళి అక్కడి నుండి పంపేస్తారు. లేకపోతే పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టి సభ అయిపోయిన తర్వాత విడిచిపెట్టేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రెండు రోజుల పాటు యువకులను తిప్పిన చోట తిప్పకుండా, కేసులు పెట్టకుండా పోలీసులు చావకొట్టేశారు. మరపుడు రూల్ ఆఫ్ లా ఏమైంది ?
అలాగే వైసిపి ఎమ్మెల్యేలు+ఎంపిలను లొంగదీసుకునేందుకు అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటవేశ్వరరావుపై వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేసినా ఉపయోగం కనబడలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయ వ్యవస్ధ గుప్పిట్లో ఇరుక్కున్నంత కాలం పోలీసుల పనితీరు ఇలాగే ఉంటుందనటంలో సందేహం లేదు. నిజానికి క్షేత్రస్ధాయిలో చాలామంది పోలీసు అధికారులు చేసే వ్యవహారాలపై డిజిపికి సమాచారం కూడా ఉండదు. కిందస్ధాయి అధికారులు అత్యుత్సాహంతో తీసుకునే నిర్ణయాలు వికటించి కొంపమునిగినప్పుడు మాత్రమే డిజిపి దృష్టిలో పడుతుంది. కాబట్టి పోలీసు వ్యవస్ధకు స్వతంత్రప్రతిపత్తి కల్పించనంత వరకు పరిస్ధితి ఇలానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: