మెట్రో రైళ్లలో నిబంధనలు ఇవే..!
మూడు దశలలో మూడు కారిడార్‌లలో రైళ్లను పునరుద్ధరించనుంది హైదరాబాద్ మెట్రో. రైలులో ప్రయాణించేందుకు వచ్చిన ప్రయాణీకులను థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతే.. స్టేషన్లలోకి అనుమతించనున్నారు అధికారులు. కంటైన్మెంట్ జోన్లలో ఉండే మెట్రో స్టేషన్లు మూసివేసి ఉంటాయి. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా గాంధీ దావఖాన, భరత్‌నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ స్టేషన్లలో రైళ్లు ఆగవు. స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై సీసీ కెమెరా నిఘా ఉంటుంది. జరిమానా నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. భద్రత దృష్ట్యా అధికారులు మాక్ డ్రిల్స్ కూడా చేస్తుంటారు.
మొదటగా సోమవారం నుంచి మియాపూర్ - ఎల్బీనగర్ కారిడార్‌లో రైళ్లు ప్రారంభమవుతాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే నిర్ణిత సమయంలోనే రైళ్లను నడుపుతారు. మంగళవారం నుంచి నాగోలు నుంచి రాయదుర్గం వరకు రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయి. 9 నుంచి ఎమ్ జీబీఎస్ నుంచి జేబీఎస్ స్టేషన్ వరకు మెట్రో సేవలు మొదలవుతాయి. ఇక అప్పటి నుంచి మొత్తం మూడు ఫేజ్‌లలో రైళ్లు నడుస్తుంటాయి. నిర్ణిత సమయంలో ప్రతి 5 నిమిషాలకో రైలు అందుబాటులో మెట్రో స్టేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.
మెట్రోలో ప్రయాణించే వారికి కొవిడ్ నిబంధనలను కూడా జారీ చేశారు అధికారులు. స్టేషనుకు వచ్చే వారికి మాస్క్ తప్పనిసరి. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సిందే. స్టేషన్లలో సూచించిన నిబంధనలను కచ్చితంగా అనుసరించావలసి ఉంటుంది. స్టేషన్ లోపల భౌతిక దూరం పాటించేలా ఉన్న మార్కింగ్స్‌లోనే నిల్చోవాలి.. అనవసరంగా తీరగకూడదు. రైలులో రెడ్ మార్కింగ్ చేసి ఉన్న సీట్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. ప్రయాణికుల కదలికలను నిరంతరం సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షిస్తుంటారు. నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా తప్పదు. రైళ్లలో ఏసీ సరఫరా ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా గాలి బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.
మెట్రో స్టేషన్లు అన్నింటిలో మాస్కులను కూడా విక్రయించనున్నారు అధికారులు. ప్రవేశ మార్గం వద్దే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఏవైనా స్వల్ప లక్షణాలు ఉంటే వెంటనే వెనక్కి పంపిస్తారు. మెట్రో స్టేషనులోకి అనుమతించరు. అన్ని స్టేషన్ల ప్రవేశ మార్గాలు, నిష్క్రమణల వద్ద పెడల్ శానిటైజర్లు ఉంటాయి. రైళ్ల రాకపోకలు లేని సమయంలో స్టేషన్లలో డిస్ ఇన్‌ఫెక్ట్ ప్రక్రియ చేపడుతారు నిర్వాహకులు. లిఫ్టులను బంద్ చేస్తారు. ఎస్క్‌లేటర్ హ్యాండ్ రెయిల్స్, మెట్ల మార్గంలోని గోడలను 4 గంటలకోసారి శానిటైజ్ చేస్తారు. మెట్రో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తారు. స్మార్ట్‌కార్డు, మొబైల్ క్యూఆర్ టికెటింగ్, క్యాష్‌లెస్ ప్రయాణాన్ని ప్రోత్సహించనుంది మెట్రో సంస్థ. తక్కువ లగేజీ ప్రయాణంతోనే అనుమతించడంతో.. ప్రయాణికులు ఎక్కువ నిలబడకుండా స్కానింగ్ త్వరగా మగుస్తోంది. దీంతో రద్దీని నివారించవచ్చు.