ప్రజల మనీషి.. మహా మనీషి..!

NAGARJUNA NAKKA
కొందరుంటారు. తమదైన వ్యక్తిత్వంతో బలమైన ముద్ర వేస్తారు. చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోతారు. ప్రజల మనీషిగా, మహామనీషిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వమే.. డాక్టర్‌ వై.యస్.రాజశేఖర్ రెడ్డి.  
డాక్టర్‌వైయస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసి పదకొండు సంవత్సరాలు గడిచిపోయాయి. వైయస్సార్ 12వ వర్ధంతి వచ్చింది. మరిచిపోలేని నవ్వు, రాజసం ఉట్టిపడే నడక, ప్రేమ పలకరింపు. అనుక్షణం ప్రజలకోసం పరితపించిన ఆ మనసు మన జ్ఞాపకాలను తడుతూనే వుంటుంది. గుండె తడి తెలిసేలా చేస్తూనే వుంటుంది. ఒక రూపాయి డాక్టర్ గా జీవితం ప్రారంభించి...అంచెలంచెలుగా ఎదిగిన తీరు ప్రత్యేకం. ముఖ్యమంత్రుల్లో ఆయనది చెరగని సంతకం. ఎన్నెన్నో కలలు. ఎన్నెన్నో ఆలోచనలు. ఆ కలల్లో ...ఆలోచనల్లో ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు. తలపెట్టినవేవీ నెరవేరకుండా పోకూడదన్న దృఢసంకల్పం.  
వై.యస్.ఆర్ ను అనుక్షణం రగిలించి కదిలించిన ఇంధన శక్తులు ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. అట్టడుగు వర్గాలు, పేదల గురించి వైయస్ ఆర్ చేసిన ఆలోచనలు ప్రజా ప్రభుత్వం అన్నమాటకు  నిర్వచనమిచ్చాయి. దీర్ఘకాలిక  ప్రయోజనాలకు దారివేస్తూ...స్వల్పకాలిక లక్ష్యాలను తక్షణమే సాధిస్తూ వైయస్ఆర్  గణనీయమైన మార్పులు తెచ్చారు. సామాన్యుల్లో జీవశక్తిని నింపిన రాజకీయ వైద్యుడు రాజశేఖరుడు. ఆయన నవ్వు పైప్రజలకు ఓ నమ్మకమయింది. ఆయన మాట ప్రజలకు భరోసా అయింది.  కాంగ్రెస్ పార్టీని మించిన ఇమేజ్ ఒక రకంగా వైయస్ఆర్ సొంతం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా చివరి శ్వాస వరకు అదే పార్టీ లో ఉన్న ఆయన... కష్ట కాలంలో ఆ పార్టీకి ఊపిరిలూది రెండు సార్లు అధికార పగ్గాలు అందించిన ఖ్యాతి తన పేరు మీద లిఖించుకున్నారు.
కడప జిల్లా పులివెందుల నుంచి ప్రారంభం అయిన వైయస్ఆర్ రాజకీయ ప్రస్థానం 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. వైయస్ఆర్ 33 ఏళ్లకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ప్రెసిడెంట్‌అయ్యారు. కానీ ముఖ్యమంత్రి కావాడానికి మరో 22 ఏళ్ల పట్టింది. ఆ మధ్యలో స్వంత పార్టీలో లుకలుకలతో ఓ వైపు, బయట పార్టీ లతో   పోరాటం మరో వైపు.  అన్నింటికీ ధీటుగా ఎదుర్కొని నిలబడ్డారు.
అంతేకాదు సొంతపార్టీని బలంగా రూపుదిద్దడంలో సూపర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ అయ్యారు. పేరుకు జాతీయ పార్టీ అయినా... ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి వైయస్ఆర్  నడిపించిన పార్టీగా మారిపోయింది. కాంగ్రెస్ అంటే వైఎస్, వైఎస్ అంటే కాంగ్రెస్ స్థాయి ఇమేజ్ సృష్టించుకోగలిగారు. ప్రజా ప్రస్థానం పేరు తో ఆయన చేసిన పాదయాత్ర కాంగ్రెస్ కు జవ జీవాలు పోసింది. 2004, 2009..రెండు సార్లు పార్టీని ఒంటి చేత్తో విజయపంథాలో నడిపించిన ఘనత అచ్చంగా వైయస్ఆర్ దే. వైయస్సార్‌ వ్యక్తిత్వ బలం అటు జీవితంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఆయనను విజేతగా నిలిపింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: