ఫీజుల దోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారు..?

NAGARJUNA NAKKA
అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆన్ లైన్ క్లాసులు, ఫీజుల నియంత్రణపై సర్కారు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని స్కూళ్లకు నోటీసులిచ్చామని తెలిపింది ప్రభుత్వం. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ ఖరారు చేశామని తెలిపింది. తర్వాతి విచారణ సెప్టెంబర్ 18కి వాయిదా పడింది.
ఆన్‌లైన్‌ క్లాసులు, ప్రైవేట్ స్కూళ్లలో..ఫీజులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్‌లైన్ క్లాసుల విధివిధానాలు.. ఖరారు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా.. క్లాసులు నిర్వహించనున్నట్లు సర్కారు వివరించింది. విద్యార్థులకు అనుమానాలు వస్తే.. టీవీ పాఠాల్లో ఎలా నివృత్తి చేసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. స్కూళ్లలో టీచర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం సమాధానమిచ్చింది. కుటుంబంలో ముగ్గురు విద్యార్థులుంటే.. ఒకేసారి పాఠాలు ఎలా వింటారని హైకోర్టు సర్కారుని వివరణ కోరింది. 1-10వ తరగతి వరకు వేర్వేరు టైమ్‌లో.. పాఠాలు ప్రసారమవుతాయని ప్రభుత్వం చెప్పింది.
ఆన్‌లైన్ తరగతులకు హాజరు తీసుకోబోమని సర్కారు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో.. వేర్వేరు సమస్యలు ఉన్నాయని చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో పేద విద్యార్థుల సంగతేంటని ప్రశ్నించిన హైకోర్టు.. ప్రభుత్వ విధానాలపై అభ్యంతరాలుంటే చెప్పాలని పిటిషనర్లకు సూచించింది.  ఫీజులు చెల్లించకుంటే అడ్మిషన్.. రద్దు చేస్తున్నారని హైదరాబాద్ తల్లిదండ్రుల అసోసియేషన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఫీజులకు సంబంధించి ఇప్పటికే జీవో జారీ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. జీవో ఉల్లంఘించిన విద్యాసంస్థలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చామని సర్కారు కోర్టు దృష్టికి తెచ్చింది. గుర్తింపు రద్దు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. బోయిన్‌పల్లి పీఎస్‌లో పేరెంట్స్‌పై కేసులు పెట్టారని లాయర్ చెప్పడంతో.. ఏ కారణంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాతి విచారణ సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: