3 ఏళ్లలోనే.. 20 ఏళ్లకు సరిపడా.. అదిరిపోయిన వైసీపీ మంత్రి ప్లాన్..?
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుపై ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు. రాష్ట్రంలో జోనల్ పరిశ్రమల ఏర్పాటులో వేగం కోసం రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ లుగా విభజించారు. పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రాంతాల అభివృద్ధికోసం 3 రాజధానులతో ముందుకెళుతున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయి అవార్డునందుకున్న విశాఖ ఎయిర్ పోర్టును డిసెంబర్ లో నిర్మాణ పనులు చేపడతామని మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నారు.
వచ్చే మూడేళ్లల్లోనే 20 ఏళ్ల అభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టాలన్నది పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్లాన్. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారట. త్వరలో రామాయపట్నం పోర్టు నిర్మాణం మొదలు పెడతారట. మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం కూడా మరో 3, 4 నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఒక్కో పోర్టుకు రూ.10వేల కోట్లతో 3 మేజర్ పోర్టులు, దాదాపు 2వేల కోట్లు వెచ్చించి ఏడు ఫిషింగ్ హార్బర్లు, కారిడార్లు సిద్ధం చేస్తారట. అంతే కాదు.. చేపల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతుల కోసం ఏడు హార్బర్ లను అధునాతనంగా నిర్మిస్తారట. 45 వేల ఎకరాలలో శ్రీసిటీ తరహాలో సదుపాయాలుండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లను కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రణాళికలు బాగానే ఉన్నాయి. ఆచరణలోకి తీసుకొస్తేనే అసలు ఫలితాలు కనిపించేది. గతంలో చంద్రబాబు సర్కారు కూడా ఏపీ వాసులకు ఇలాగే అరచేతిలో వైకుంఠం చూపించింది. కానీ చేతల ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ సర్కారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే సంతోషమే కదా.