ఓరి నాయనో ఈ జంపింగ్ నేతల బాధ తీర్చేవారే లేరా ?
టిడిపి రాజకీయంగా ఓటమి చెందిన తర్వాత, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి వారు నేరుగా వైసీపీలో చేయకపోయినా, బయటి నుంచి మద్దతు పలుకుతున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు వంటి వారు వైసిపిలో చేరిపోయారు. ఆ సందర్భంలో కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీ అవకాశం ఇలా ఎన్నో హామీలు తీసుకుని అధికార పార్టీలో చేరారు. కానీ వీరి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే వీరికి పదవులు ఇద్దామని వైసిపి అధిష్టానానికి ఉన్నా, సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతాయి అన్న అభిప్రాయంతో వైసీపీ అధినేత,ఏపీ సీఎం జగన్ వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ఆర్ సీపీ నాయకులు చాలామందికి ఇప్పటికీ సరైన పదవులు దక్కలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఈ విధంగా పదవులు కట్టబెడితే, వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనే అభిప్రాయంతో వైసీపీ అధిష్టానం వెనుక అడుగు వేస్తూ ఉండగా, టిడిపి, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిలో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. తాము పదవుల హామీలు పొంది పార్టీలోకి వచ్చిన అధిష్ఠానం తమను పట్టించుకోని వ్యవహరిస్తుండడంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నేరుగా ఈ విషయాలపై జగన్ ను కలిసి తమ బాధను చెప్పుకుందాం అనుకుంటున్నా, అవకాశం దక్కకపోవడంతో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో వీరంతా ఉన్నారట.