సాక్షి సీనియర్ జర్నలిస్టును బలి తీసుకున్న కరోనా..?

Chakravarthi Kalyan
కరోనా కోరలకు మరో పాత్రికేయుడు కన్నుమూశారు. సాక్షి సీనియర్ జర్నలిస్టు, తెలుగు ప్రేమికుడు పట్నాయకుని వెంకటేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. తెలుగు భాషాభిమానిగా ఆయనకు మంచి పేరు ఉంది. సాక్షి టీమ్‌లో ఓ మంచి వ్యక్తిగా, కల్మషం లేని మంచి మనిషిగా ఆయన్ను అంతా అభిమానిస్తారు. ఆయన గతంలో సాక్షి చైతన్యపదం కార్యక్రమం నిర్వహించారు.


ఆయన్ను స్మరించుకుంటూ.. సాక్షి రిటైర్డ్ పాత్రికేయులు మధుసూదన్ రావు ఇలా స్మరించుకున్నారు.


వెళ్ళిపోయావా వెంకటేశ్వర్రావ్‌...
------------------------------
కొద్ది రోజుల కిందటే కదా మనం మాట్లాడుకుంది...
కరోనా మహమ్మారి అంత తేలిగ్గా తీసుకోకూడదని చెప్పింది మీరేగా...
హోమ్‌ఐసోలేషన్‌లో ఉన్నా...డాక్టర్‌ చెప్పినట్టు పాటిస్తున్నా అన్నారుగా...
ఇంతలో ఇంత ఘోరమా? కరోనా ఇంత క్రూరమా??
అసలు ఇక మీరు లేరన్న వాక్యం రాసేందుకు ఈ కలం మొరాయిస్తోంది...
ఇంకా వారం వారం తెలుగు హారం అన్న మీ గొంతుకే వినిపిస్తోంది...
ఈ వారం  మీరు అతిథిగా రండి అని పిలిచిన పలుకే గుండెను తాకుతోంది...
డెస్కు వద్దకు వస్తే చెప్పిన కబుర్లు...వేసిన సెటైర్లు...నవ్వులు..
అన్నీ అన్నీ క్షణాల్లో నిర్జీవంగా మారిపోయాయి...
మీ సుదీర్ఘ పాత్రికేయ అనుభవం...మీ అత్యున్నత భాషాశయం...
ఏవీ కరోనా నుంచి మిమ్మల్ని కాపాడలేకపోయాయి...
మీ గురించి గర్వంగా నలుగురికి  చెప్పడమే కానీ...
ఇలా రాసుకోవాల్సిన దురవస్థ వస్తుందని అనుకోలేదే...
ఇది ముమ్మాటికీ  దుర్మార్గ కాలం...
కళ్ళెదుటే కదలాడిన మనిషిని లాక్కెళ్ళే క్రూర కరోనాకాలం...
రెండ్రోజులు కరోనాతో  వీరోచితంగా పోరాడిన మీరెంతగా తల్లడిల్లి పోయారో...
తలచుకుంటేనే గుండె బావురుమంటుంది...
మీ గుండె ధైర్యం...చెదరని మీ చిరునవ్వు...
చితికిన మనసుల్ని ఓదారుస్తాయని అనుకోవడం తప్ప ఏం చేయగలం..?
అంకుల్‌ డాడీకి క్రిటికల్‌గా ఉంది ప్రేయర్‌ చేయండి అన్న మీ చిన్నారి గొంతు
నాలో నినదిస్తూనే ఉంది.,,,నా గుండెను పిండేస్తోంది...
కనీసం ఆ తల్లీ బిడ్డకు ధైర్యమివ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా...

-----------------------------


కరోనాను అంత తేలిగ్గా తీసుకోకూడదని పట్నాయకుని వెంకటేశ్వరరావు ఉదంతం తెలియజేస్తోంది. అయితే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండని వారిని సైతం కరోనా బలి తీసుకోవడం చూస్తే.. ఈ కరోనాను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: