మీడియా మంటలు: ప్రో. నాగేశ్వర్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!?
ఇలాంటి బెదిరింపులకు తాను లొంగేవాడిని కాకపోయినా.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అసలు ప్రోఫెసర్ నాగేశ్వర్ ను ఎవరైనా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. చంపుతాం అనే రేంజ్‌కు ఎందుకు వెళ్తున్నారు.. అసలు తన యూ ట్యూబ్ ఛానల్‌లో ఆయన ఏం చెబుతారు.. ఆయన యూట్యూబ్ ఛానల్ రేంజ్ ఏంటి.. ఓసారి తెలుసుకుందాం.
ఆయన 2016లో తన యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి అది తెలుగు ప్రజ ఆదరణ చూరగొంటోంది. ప్రస్తుతం ఆయన ఛానల్‌కు 4 లక్షల 85 వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపు 15 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. రాజకీయం, సామాజిక, ఆర్థిక, వ్యక్తిత్వ వికాసం.. ఇలా అనేక అంశాలపై ఆయన విశ్లేషణలు ఉంటాయి. అయితే ఆయన విశ్లేషణలు ఎందుకు కాంట్రావర్సీ అవుతున్నాయి.. ఎందుకంటే.. యథార్థవాది లోకవిరోధి అన్న సామెత మనం వినే ఉంటాం. నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న తెలుగు మీడియాలోని పత్రికలు, ఛానళ్లలాగా నాగేశ్వర్ ఏ పార్టీకీ కొమ్ముకాయరు. ఆయన నమ్మిందే చెబుతారు. ఆయన ఏపార్టీనైనా అంశాల పరంగా విమర్శిస్తే..ఆ పార్టీ అభిమానులు .. ప్రొఫెసర్ ఎదుటి పార్టీ వ్యక్తి అంటూ ఆయనపై బురద జల్లడం ప్రారంభిస్తారు. మళ్లీ ఎదుటి పార్టీని విమర్శిస్తే.. వారు కూడా మొదటి పార్టీ వ్యక్తి అంటూ బురద జల్లుతుంటారు.
ప్రోఫెసర్ నాగేశ్వర్ ఎన్నోసార్లు కేసీఆర్ తీరును విమర్శించారు. చంద్రబాబునూ విమర్శించారు. జగన్‌నూ విమర్శించారు. కానీ.. ఇదంతా ఫ్యాన్స్ గమనించరు.. తమ నాయకుడిని విమర్శించగానే కామెంట్లలో తిట్లు, విమర్శలు ప్రారంభిస్తారు. ఇంకొంచెం అతిగా ప్రవర్తించేవాళ్లు ఇలా ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. అదీ సంగతి.