ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం... మద్యం డోర్ డెలివరీ...?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటం... ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటికే మద్యం సరఫరా చేసేందుకు మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీ చేసింది.
 
మేఘాలయ మంత్రి జేమ్స్ కే సంగ్మా మీడియాతో మాట్లాడుతూ ఇంటికే మద్యం సరఫరా చేయాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు. అయితే మద్యం సరఫరా విషయంలో ప్రభుత్వం పరిమితులు విధించింది. ఒక ఆర్డర్‌పై మూడు లీటర్ల మద్యం, నాలుగు లీటర్ల బీర్‌ కన్నా ఎక్కువ సరఫరా చేయడానికి వీలు లేదని కీలక ప్రకటన చేసింది. మద్యం కొనుగోలు చేసే వాళ్లు తమ వయస్సు 20 కంటే ఎక్కువని తెలిపే పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
 
ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేమ్స్ కే సంగ్మా హెచ్చరించారు. కేంద్రం లాక్ డౌన్ నిబంధనల వల్ల పబ్స్, బార్స్ పై నిషేధం కొనసాగుతోంది. రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం కావడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా పెంచుకొనేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తూ డోర్ డెలివరీకి అనుమతిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది.
 
మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పున: సమీక్షించే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. చీప్ లిక్కర్ ధరలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మద్యం ధరలు విపరీతంగా పెరగడం... లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడంతో కొందరు శానిటైజర్లకు అలవాటు పడుతున్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి సైతం చీప్ లిక్కర్ పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జగన్ సర్కార్ మద్యం ధరల తగ్గింపు దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: